విడుదల తేదీ : సెప్టెంబరు 27, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఇంద్ర, సుకృత వాగ్లే, ప్రియదర్శి
దర్శకత్వం : శ్రీహర్ష మంద
నిర్మాతలు : జి ఎల్ ఫణికాంత్ ,శ్రీమతి విశాల లక్ష్మీ
సంగీతం : కేశవ్ కిరణ్
సినిమాటోగ్రఫర్ : సన్నీ
ఎడిటర్ : గ్యారీ బిహెచ్
ఈ వారం బాక్సాపీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. నేడు మొత్తం నాలుగు చిన్న సినిమాలు విడుదల కాగా వాటిలో రామ చక్కని సీత మూవీ ఒకటి.ఇంద్ర , సుకృత వాగ్లే హీరోహీరోయిన్లుగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన రామ చక్కని సీత ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో పరిశీలిద్దాం…!
కథ:
బాలు(ఇంద్ర) హ్యాపీ గా జీవితం గడిపే ఈజీ గోయింగ్ ఫెలో. అను (సుకృత వాగ్లే) తో మొదటి చూపులోనే ప్రేమలో పడిన బాలు ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఫోన్ లో పరిచయం లేని వ్యక్తిగా సిద్దు అనే పేరుతో పరిచయం అవుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సిద్దు పేరుతో తనను మోసం చేసింది బాలు అనే విషయం తెలుసుకున్న అను అతనిని దూరం పెడుతుంది. మనస్పర్థలతో విడిపోయిన ఈ జంట ఎలా కలిశారు? బాలు అను ప్రేమను గెలుచుకున్నాడా? అను బాలు చేసిన తప్పును క్షమించి మళ్ళీ అతన్ని చేరుకుందా? చివరికి బాలు, అను ల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథకు కట్ట్టుబడి సినిమా మొత్తం ఎక్కడా పక్కదారి పట్టకుండా అవసరం లేని కమర్షియల్ అంశాలు జొప్పించకుండా చెప్పిన తీరు అభినందనీయం. హీరోగా మొదటి ప్రయంత్నంలోనే ఇంద్ర ఆకట్టుకున్నాడు.
ఇక హీరోయిన్ సుకృత నటన పర్వాలేదు అన్నట్లుగా ఉంది, ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, పాటలలో ఆమె నటన అద్భుతంగా ఉందని చెప్పలేం కానీ, ఆకట్టుకుంటుంది. ఇక కమెడియన్ ప్రియదర్శి పాత్ర తెరపై నవ్వులు కురిపించడంలో విజయం సాధించింది. మూవీకి ప్రియదర్శి కామెడీ సన్నివేశాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
దర్శకుడు సున్నితమైన హాస్యాన్ని చక్కగా చాలా నీట్ గా ప్రెసెంట్ చేశారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు కూడా ఆకర్షణీయంగా తెరకెక్కించారు. కథకు తగ్గట్టుగా నడిచే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. సాధారణంగా ప్రేమ, స్నేహం వంటి విషయాలలో నేటి తరం యువత తీసుకొనే అనాలోచిత నిర్ణయాల గురించి తెరపై మనసుకు హత్తుకొనేలా ఆవిష్కరించారు.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీ ప్రధాన బలహీనత కథ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి కథ గతంలో అనేక చిత్రాలలో ప్రేక్షకుడికి చూసిన అనుభూతి కలగడం వలన ఓ కొత్త చిత్రం చూస్తున్నాం అనే భావన కలగదు.
మొదటి సగంలో తన సహజ నటనతో ఆకట్టుకున్న ఇంద్ర సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ ని అనుకరించడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ సాంగ్ నేపథ్యంలో సాగే ఓ ఫైట్ సీన్ నిరాశ కలిగించింది.
ప్రేమకథలకు ప్రధాన బలమైన భావోద్వేగ పూరిత పతాక సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపించవు. ప్రేమ కోసం పరితపించిన జంట కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు ప్రభావవంతగా లేకపోగా, సిల్లీగా అనిపించింది.
సాంకేతిక విభాగం:
చిన్న చిత్రం ఐనప్పటికీ మూవీ నిర్మాణ విలువలు బాగున్నాయి. వైజాగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కెమెరా మెన్ తెరపై చాలా అందంగా చూపించారు. కేశవ్ కిరణ్ అందించిన మ్యూజిక్ ఈజీ గా చేరువయ్యేలా వినసొంపుగా ఉంది. అలాగే పాటలు చిత్రీకరించిన విధానంగా కూడా బాగుంది.
ఈ మూవీలో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, టైమింగ్ తో కూడిన సెన్సిబుల్ డైలాగ్స్ మంచి హాస్యం పండిచాయి. పాటలలో చరణాలు మరియు ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా ఈ చిత్రంలో చాలా బాగుంది.
దర్శకుడు శ్రీ హర్ష గురించి చెప్పాలంటే ఆయన తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకుంటారు. బలహీనమైన అందరికి తెలిసిన కథను ఆకర్షణీయంగా చెప్పడంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. సంక్లిష్టత వైపు పోకుండా సులభంగా అందరికి అర్థమయ్యేలా సన్నివేశాలు, కథను రాసుకున్నారు. క్లైమాక్స్ ఇంకొంచెం ఎమోషనల్ గా ఆసక్తికరంగా రాసుకొని ఉంటే రామ చక్కని సీత మరో స్థాయిలో ఉండేది.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే రామ చక్కని సీత కొంత మేర అలరించే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మంచి హాస్యం తో, సింపుల్ ఎమోషనల్ సన్నివేశాలలో కూడి తక్కువ నిడివి కలిగిన రామ చక్కని సీత పర్లేదు అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఆశించకుండా మూవీ చూస్తే రామ చక్కని సీత మూవీ ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team