సమీక్ష : రామం రాఘవం – అక్కడక్కడ ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా

Ramam Raghavam Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సముద్రఖని, ధన్‌రాజ్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్ తదితరులు
దర్శకుడు : ధన్‌రాజ్
నిర్మాత : పృథ్వి పోలవరపు
సంగీతం : అరుణ్ చిలువేరు
సినిమాటోగ్రఫీ : దుర్గాప్రసాద్ కొల్లి

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

కమెడియన్‌గా ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించిన ధన్‌రాజ్, ఇప్పుడు దర్శకుడిగా మారి చేసిన సినిమా ‘రామం రాఘవం’. విలక్షణ నటుడు సముద్రఖని, ధన్‌రాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
దశరథ రామం(సముద్రఖని)కి తన కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే ఎంతో ప్రేమ. రిజిస్ట్రార్ ఆఫీసులో నిజాయితీ ఆఫీసర్ అయిన రామం తన కొడుకుని గొప్పగా చూడాలని అనుకుంటాడు. కానీ, రాఘవ మాత్రం పెద్దగా చదువుకోకపోవడం తో ఎలాంటి ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. ఓ సందర్భంలో తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని బిజినెస్ పెడతానన్న రాఘవ వాటిని బెట్టింగ్‌లో కోల్పోతాడు. ఫలితంగా రామంపై రాఘవ కోపం పెంచుకుంటాడు. తన తండ్రిని చంపేందుకు ఓ లారీ డ్రైవర్‌తో డీల్ కుదుర్చుకుంటాడు రాఘవ. ఇంతకీ రాఘవ రామంని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నిజంగానే రామంపై రాఘవ పగపెంచుకున్నాడా..? లారీ డ్రైవర్ రామంని చంపేస్తాడా..? అనేది తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
తండ్రీకొడుకుల అనుబంధంపై టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘రామం రాఘవం’ కూడా ఈ కోవలోకే చెందిన సినిమా. కొడుకు అంటే ప్రాణంగా చూసుకునే తండ్రికి అతడి ప్రవర్తన వల్ల ఎదురయ్యే కష్టాలను మనకు ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. తండ్రి పాత్రలో సముద్రఖని చాలా బాగా నటించారు. ఆయనకు ఇలాంటి పాత్రలు ఎంతలా సూట్ అవుతాయనేది ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. అటు కొడుకు పాత్రలో ధన్‌రాజ్ కూడా ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాలోని ఎమోషన్స్‌ను పండించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తండ్రీ కొడుకుల మధ్య సాగే సీన్స్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. అయితే, తండ్రిపై పగపెంచుకున్న కొడుకు, ఆయన్ను చంపేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తాడనేది గ్రిప్పింగ్‌గా చూపెట్టారు. సెకండాఫ్‌లో ట్విస్టుని రివీల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌ను బాగా ప్రెజెంట్ చేశారు.. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఏడిపించారని చెప్పాలి. ఒక ఎమోషనల్ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో ధన్‌రాజ్ డైరెక్టర్‌గా మంచి ప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథలోకి వెళ్లేందుకు ప్రేక్షకులకు చాలా సమయం పడుతుంది. ఒక రొటీన్ ప్లాట్‌లా అనిపించే ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది. అన్ని చిత్రాల్లో మాదిరిగా ఇందులోనూ తండ్రి కోరికను తీర్చలేని కొడుకు కథతో తొలుత ప్రేక్షకులకు కొంతమేర చిరాకు తెప్పిస్తారని చెప్పాలి. ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు లేకుండా సాగే ఫస్ట్ హాఫ్ లెంగ్తీగా ఉన్నట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఫస్ట్ హాఫ్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది.

ఇక ఈ సినిమాలో ధన్‌రాజ్ లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనికి సంబంధించిన సీన్స్ ఆకట్టుకోవు. అటు కమెడియన్ సత్య నవ్వులు తెప్పించేందుకు చేసిన ప్రయత్నం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. 30 ఇయర్స్ పృథ్వి కూడా కొన్ని సీన్స్ వరకే ఓకే అనిపించాడు. అతని పాత్రను ఇంకాస్త మెరుగ్గా చూపించాల్సింది.

దీనికి తోడు పాటలు కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి. కొన్నిచోట్ల పాత్రలను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించడం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఎమోషనల్ క్లైమాక్స్ ఉన్నప్పటికీ, దానిని ఎంగేజింగ్‌గా మలడంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉండాల్సింది.

సాంకేతిక వర్గం :
ధన్‌రాజ్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మెప్పించాడు అని చెప్పాలి. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఇతర సినిమాలలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా చూపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో దుర్గాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రతి సీన్ కూడా రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అరుణ్ చిలువేరు అందించిన బీజీఎం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
ఓవరాల్‌గా ‘రామం రాఘవం’ ఒక ఎమోషనల్ కథతో సాగే డ్రామాగా ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంటుందని చెప్పాలి. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని సరికొత్త విధంగా చూపెట్టేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అయితే, ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకపోవడం.. కథ స్లో గా సాగిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి. కొన్ని అంశాలను మినహాయిస్తే, ఈ ఎమోషనల్ డ్రామా మూవీని ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version