విడుదల తేదీ: మార్చి 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, బాబీ సింహా, అనసూయ భరద్వాజ్, వేదిక, తేజ్ సప్రు, ఇంద్రజ, తలైవాసల్ విజయ్
దర్శకుడు: యాట సత్యనారాయణ
నిర్మాత: గూడూరు నారాయణరెడ్డి
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్: రమేష్ కుశేందర్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంబంధిత లింక్స్: ట్రైలర్
రజాకార్ (Razakar Movie Review) అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
భారతదేశం 1947లో బ్రిటీష్ నుండి స్వాతంత్ర్యం పొందింది. నిజాం ఆఫ్ హైదరాబాద్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మార్ఖండ్ దేశ్‌పాండే) నియంత్రణలో అతిపెద్ద రాచరిక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా మిగిలిపోయింది. హైదరాబాద్ నిజాం ప్రవేశ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు మరియు యూనియన్ ఆఫ్ ఇండియాతో ఒక సంవత్సరం స్టాండ్‌స్టెల్ ఒప్పందాన్ని ఎంచుకున్నాడు. మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏర్పాటు చేసిన రజాకార్స్ అనే పారామిలిటరీ ఆర్మీ ఫోర్స్ ఆ కాలంలో ఖాసిం రజ్వీ (రాజ్ అర్జున్) కంట్రోల్ లో ఉంది. ఖాసిం రజ్వీ, హైదరాబాద్ నిజాంకు తన పూర్తి మద్దతునిచ్చాడు. వారు తమ దురాగతాలతో హిందువులలో భయాందోళనలను రేకెత్తించారు. తర్వాత ఏం జరిగింది అనేది రజాకార్ చిత్రం (Razakar Movie Review) లో చూపించడం జరిగింది.
ప్లస్ పాయింట్స్:
నిజాం హయాంలో జరిగిన ఈ మారణహోమం గురించి వినని వారైతే సినిమా చూసి షాక్ అవుతారు. చాలా మంది హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు మరియు బలవంతపు మత మార్పిడులు షాక్ కి గురి చేస్తాయి. ఎందుకంటే అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూపించబడ్డాయి. చాలా ఆకట్టుకొనే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుడు ఖచ్చితంగా బరువెక్కిన హృదయంతో బయటకు వెళ్తాడు.
ఈ మారణహోమం గురించి మీకు తెలిసినప్పటికీ, ఈ సినిమాలో మరిన్ని విషయాలను కీలకం గా చూపించడం జరిగింది. చాలా మంది అమాయకులు అనుభవించిన అకృత్యాలను డాక్యుమెంట్ చేయడంలో రైటింగ్ టీమ్ రీసెర్చ్ బెస్ట్ వర్క్ ఇచ్చింది అని చెప్పాలి. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను కలిపేసేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో ఉత్కంఠకు గురి చేయడం ఖాయం.
దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని వివరించే కథలను మనం తరచుగా వింటూ ఉంటాం. హైదరాబాద్‌ను భారతదేశంలో ఒక భాగంగా చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి పాత్ర పోషించారనే విషయంలో ఈ చిత్రం మీకు మరింత స్పష్టత ఇస్తుంది. ఇది ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఇది సాధారణ ప్రజలపై నిజాం మరియు రజాకార్లు చేసిన దౌర్జన్యాలను మాత్రమే హైలైట్ చేస్తుంది.
రాజ్ అర్జున్ రజాకార్ షో స్టీలర్ అని చెప్పాలి. ఖాసిం రజ్వీ పాత్రతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ నిజాం పాత్రలో మార్ఖండ్ దేశ్‌పాండే అద్భుతంగా నటించాడు, అలాగే తేజ్ సప్రూ భారతదేశపు ఉక్కు మనిషి పాత్రలో నటించారు. బాబీ సింహా, అనసూయ, వేదిక, ఇంద్రజ తదితరులు ఆకట్టుకునే నటనను కనబరిచారు. సెకండాఫ్ చాలా కీలక ఘట్టాలతో మరింత గ్రిప్పింగ్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ అంతా హిందువులపై రజాకార్ల క్రూరత్వాన్ని చూపించడం జరిగింది. ఇక్కడ కొన్ని సన్నివేశాలు స్లో గా సాగాయి. కొన్ని సన్నివేశాలు రిపీట్ గా ఉన్నాయి. కథనం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
రజాకార్ చాలా నిజాయితీతో తీసిన చిత్రం. ఎవరైనా వినోదాన్ని ఆశించినట్లయితే ఈ చిత్రం వారి కి సెట్ కాదు. దౌర్జన్యాలు మరియు క్రూరమైన చర్యలు, ఎటువంటి రిస్త్రిక్షన్స్ లేకుండా చూపించబడ్డాయి. ఈ విజువల్స్ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు.
సాంకేతిక విభాగం:
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ రమేష్ కుశేందర్ బాధిత ప్రజల వేదనను చక్కగా చిత్రించారు. తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికి, నిర్మాణ విలువలు బాగున్నాయి. VFX బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అధ్బుతమైన వర్క్ చేసింది. సినిమాలో సెట్స్ చాలా బాగున్నాయి.
దర్శకుడు యాట సత్యనారాయ ఒక దారుణమైన మారణహోమాన్ని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ సాధించారు. ఈ చిత్రం సందేశాత్మకంగా, హృదయ విదారకంగా ఉంది. రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది హీరోల ధైర్యాన్ని కూడా ఇందులో చూపించడం జరిగింది. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలతో దర్శకుడు వస్తే కెరీర్‌లో చాలా దూరం వెళ్లగలడు.
తీర్పు:
మొత్తం మీద, నిజాం కాలంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన దారుణ మారణహోమాన్ని రజాకార్ (Razakar) లో నిజాయితీగా చూపించారు డైరెక్టర్. భయానక వాస్తవాలతో మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సామాన్య ప్రజల కష్టాలను ఇందులో చక్కగా చూపించారు. రజాకార్ల గురించి తెలియని వారు సినిమా చూస్తే షాక్ కి గురి అవుతారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. సినిమా సాంకేతికంగా చాలా రిచ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా, కొన్ని రిపీట్ సీన్స్ తో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ ప్రతి నిమిషం మన దృష్టిని ఆకర్షిస్తుంది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team