ప్రభాస్ ‘సలార్’ టైటిల్ వెనుక అర్థం ఇది !

ప్రభాస్ ‘సలార్’ టైటిల్ వెనుక అర్థం ఇది !

Published on Dec 3, 2020 3:00 AM IST

ప్రశాంత్ నీల్.. కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిచయం ఉన్న ఈ పేరు 2018 డిసెంబర్లో విడుదలైన ‘కెజిఎఫ్’ తర్వాత దేశవ్యాప్తమైంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’తో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది. ఈలోపే ప్రశాంత్ నీల్ తన తర్వాతి సినిమాను ప్రకటించారు. ముందు నుండి చెబుతున్నట్టే ఆయన ప్రభాస్ హీరోగా సినిమాను ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే సినిమా పేరును, ప్రభాస్ లుక్ ను అధికారికంగా రివీల్ చేశారు.

సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇదొక బహుభాషా చిత్రం. అందుకే అన్ని భాషలకు సెట్టయ్యేలా ‘సలార్’ టైటిల్ నిర్ణయించారు. ‘సలార్’ అనేది ఒక ఉర్దూ పదం. ‘సలార్’ అంటే ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపువాడు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన నాయకుడన్నమాట. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా ఈ టైటిల్ అర్థం తెలుసుకునే పనిలోనే ఉన్నారు. టైటిల్ పోస్టర్ మీదే హింసాత్మకమైన వ్యక్తులు ఒక మనిషిని హింసాత్మకమైన వ్యక్తి అని పిలుస్తుంటారు.. అతనే ‘సలార్’ అంటూ టైటిల్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పేశారు.

ప్రభాస్ లుక్ కూడ టైటిల్ కు తగ్గట్టే వయొలెంట్ గా ఉంది. ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ కూడ మార్చుకుంటున్నారు. ‘కెజిఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల సమయానికి భారీ హైప్డ్ మూవీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు