IPL 2025 : SRH, MI, CSK ఎందుకు వెనుకబడ్డాయి..?

IPL 2025 : SRH, MI, CSK ఎందుకు వెనుకబడ్డాయి..?

Published on Apr 9, 2025 10:00 PM IST

ఐపీఎల్ 2025 సీజన్ కొన్ని అనూహ్యమైన ట్విస్ట్‌లను సృష్టించింది. అందులో మూడు దిగ్గజ జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పాయింట్స్ టేబుల్‌లో దిగువ మూడు స్థానాల్లో ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏప్రిల్ 9, 2025 నాటికి ఈ హేమాహేమీ జట్లు గత విజయాలతో సంబంధం లేకుండా దారుణంగా విఫలమయ్యాయి. అసలు ఈ జట్ల పతనానికి గల కారణాలు ఏమిటి..? అనే అంశాలను ఇక్కడ విశ్లేషిద్దాం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ : గత ఘనత నుంచి పతనం

2024 ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, తమ విధ్వంసకర బ్యాటింగ్, క్రమశిక్షణ బౌలింగ్‌తో పేరుగాంచిన జట్టు. ఈ సీజన్‌లో తమ పాత ఫామ్‌ను పూర్తిగా కోల్పోయింది. 5 మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో, -1.629 నెట్ రన్ రేట్‌తో టేబుల్ దిగువన నిలబడింది. SRH జట్టు అస్థిరత, ఉత్సాహం లేకపోవడంతో సతమతమవుతోంది. టాప్ ఆర్డర్ వైఫల్యం కావడంతో మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో పడింది. పాట్ కమిన్స్ నాయకత్వంలో బలంగా ఉండే బౌలింగ్ యూనిట్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయలేకపోయింది. మెగా వేలంలో బలమైన కోర్‌ను నిలుపుకున్నప్పటికీ, కొత్త ఆటగాళ్లు సమిష్టిగా ఆడలేకపోవడం, వారి దూకుడు ఆట తగ్గిపోవడం మనకు ఈ జట్టులో స్పష్టంగా కినిపిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్: స్టార్ పవర్ ఉన్నా ఫలితాలు లేవు

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా సమస్యల్లో కూరుకుపోయింది. ఐదు మ్యాచ్‌లలో ఒక్క విజయంతో, -0.010 నెట్ రన్ రేట్‌తో 9వ స్థానంలో నిలబడింది. MIలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నా విజయాలను అందుకోలేకపోతోంది. గాయాలు ఈ జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. బౌలింగ్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడటం వీరి బలాన్ని దెబ్బతీసింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత వ్యూహాత్మక నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో 12 పరుగుల ఓటమి దీనికి నిదర్శనం. బ్యాటింగ్ కూడా అస్థిరంగా ఉండటం.. కొద్ది మందిపై ఆధారపడటం, వేలం తర్వాత జట్టు కూర్పు స్థిరంగా లేకపోవడం MIని సంక్షోభంలోకి నెట్టాయి.

చెన్నై సూపర్ కింగ్స్: అనుభవం సరిపోలేదు

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఐదు మ్యాచ్‌లలో ఒక విజయంతో, -0.891 నెట్ రన్ రేట్‌తో దిగువ 3వ ప్లేస్ లో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో CSK మార్చి 23న MIపై విజయంతో ఆరంభించినప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. CSK జట్టులో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే వంటి అనుభవజ్ఞులు ఉన్నా కూడా వారు విజయాలను అందించలేకపోతున్నారు. బ్యాటింగ్‌లో దూకుడు లోపించింది. గైక్వాడ్ స్థిరంగా ఆడలేకపోవడంతో మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో కుప్పకూలింది. బౌలింగ్ కూడా బలహీనంగా ఉంది. గత ఘనతపై ఆధారపడటం కంటే కొత్త ప్రతిభను తీసుకోవాలని విమర్శకులు భావిస్తున్నారు.

మెరుగుపర్చుకునే మార్గం :

SRH, MI, CSK జట్లు తమ ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవాలి. SRH టాప్ ఆర్డర్ ఫామ్, బౌలర్లు పుంజుకోవాలి. MI జట్టు స్థిరత్వంగా ఆడాలి, బుమ్రా ఫిట్‌గా ఉండి పాండ్యా నాయకత్వానికి మద్దతు ఇవ్వాలి. CSK కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం, యువతను సమతుల్యం చేయడానికి వెటరన్‌లను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు.

ఐపీఎల్ 2025లో ఫేమ్ ఒక్కటే మ్యాచ్‌లను గెలిపించదని నిరూపితమైంది. ఈ మూడు దిగ్గజ జట్లు దిగువన ఉండటం అభిమానులతో పాటు క్రికెట్ ఎక్స్‌ర్ట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది తాత్కాలిక వైఫల్యమా లేక టీ20 క్రికెట్ దిగ్గజాల స్థానంలో కొత్త మార్పులకు సంకేతమా అని అభిమానులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు