దసరా సినిమాల పరిస్థితి.. విజయం ఎవరిది?

పండుగ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే వాటికి మంచి రెస్పాన్స్‌తో పాటు వసూళ్లు రాబడుతాయని మేకర్స్ భావిస్తుంటారు. ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగలకు టాలీవుడ్‌లో సినిమాల జాతర కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ దసరాకి కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. అయితే, ఈ దసరా ఏ సినిమాకు విజయాన్ని అందించింది.. ఏ సినిమాకు నిరాశను మిగిల్చిందనే విషయాన్ని ఓసారి చూద్దాం.

ఈసారి దసరా సీజన్‌ను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ట్ చేశాడు. ఆయన నటించిన ‘వేట్టయన్’ చిత్రం భారీ క్యాస్టింగ్‌తో పాటు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమా కథ రొటీన్ కమర్షియల్ చిత్రాన్ని తలపించడంతో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ సినిమా వసూళ్ల రజినీ స్టామినాను మ్యాచ్ చయలేకపోయాయి. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘జైలర్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘విశ్వం’ కూడా మంచి అంచనాల మధ్య వచ్చింది. ఒకప్పటి క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల నుంచి ఆయన మార్క్ తరహా చిత్రంగా ముద్రవేసుకుని దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కానీ, కథలో దమ్ములేకపోవడం.. శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ రొటీన్‌గా అనిపించడంతో ఈ సినిమా కూడా యావరేజ్ రిజల్ట్‌ను రాబట్టింది. నవదళపతి సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం ఓ ఎమోషనల్ కథతో రూపొందిచామని మేకర్స్ ప్రమోట్ చేశారు. దీంతో ఈ సినిమా అయినా దసరా విజేతగా నిలుస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. కానీ, ఇలాంటి ఎమోషనల్ రైడ్ ఉన్న చిత్రాలు ఓటీటీలో వస్తే బావుండేదని విమర్శకులు సైతం సూచిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో అనుకున్న మేర రెస్పాన్స్ దక్కడం లేదు.

బాక్సాఫీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న సుహాస్ ఈ సారి ‘జనక అయితే గనక’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్‌ లేకపోవడంతో బజ్‌ని క్రియేట్ చేయలేకపోయింది. దానికి తోడు సుహాస్ గత చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలడంతో ఆ ప్రభావం దీనిపై స్పష్టంగా కనిపించింది. ‘బలగం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అయినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో బాక్సాఫీస్ విజయం కోసం సుహాస్ మరికొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.

ఇవి కాకుండా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’.. కన్నడ హీరో ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ తెలుగులో పెద్దగా బజ్ లేకుండా దసరా బరిలోకి వచ్చాయి. కానీ ఈ సినిమాలను ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. అయితే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ మూడో వారంలోనూ స్టేబుల్ రన్‌ను కొనసాగిస్తోంది. దసరా రిలీజ్‌లలో పెద్దగా ఇంప్రెస్ చేసే సినిమా లేకపోవడంతో, తెలుగు ఆడియెన్స్ ‘దేవర’కే ఓటు వేస్తున్నారు.

ఇలా దసరా బరిలో వచ్చిన చిత్రాల్లో అన్నింటిలో గోపీచంద్ ఇమేజ్‌తో పాటు 30 ఇయర్స్ పృథ్వీ కామెడితో కాస్తోకూస్తో ‘విశ్వం’ చిత్రానికే ప్రేక్షకులు ఓటేశారు. అయినా, ఈ సినిమా పూర్థి్స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. మరి ఈ దసరా సీజన్‌లో వచ్చిన సినిమాల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.

Exit mobile version