విడుదల తేదీ : ఆగస్టు 23, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు
దర్శకుడు: హరినాథ్ పులి
నిర్మాతలు : మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి
సంగీత దర్శకుడు: జాన్ కె జోసెఫ్
సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్
సంబంధిత లింక్స్: ట్రైలర్
కోస్తా తీరంలోని మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రేవు’. దర్శకుడు హరినాథ్ పులి డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ‘రేవు’ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
కోస్తా తీరంలోని పాలరేవులో అంకులు(వంశీరామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్) పోటీపడుతూ చేపల వేటతో జీవనం సాగిస్తుంటారు. అయితే, వారి పనితనం గురించి తెలుసుకున్న నాగేశు(యేపూరి హరి) ఓ పెద్ద బోటు తీసుకొచ్చి వారి జీవనాధారానికి అడ్డుపడతాడు. దీంతో అతడి అడ్డు తొలగించేందుకు వారు ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే.. నాగేశు కొడుకులు రంగంలోకి దిగుతారు. వారు అంకులు, గంగయ్యలతో ఏం చేశారు..? పాలరేవులో చేపల వేట ఎవరు కొనసాగించారు..? అంకులు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
‘రేవు’ చిత్రాన్ని కోస్తాతీరంలో తెరకెక్కించడంతో, ఆ ప్రాంత అందాలను చాలా చక్కగా చూపెట్టారు. రేవు సినిమా కథ రా అండ్ రస్టిక్‌గా ఉండటంతో ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతాయి. ఇక ఈ సినిమా కథనాన్ని నెరేట్ చేసిన విధానం బాగుంది.
ఈ సినిమాలో సహజత్వాన్ని చూపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించిన తీరు బాగుంది. సినిమాలోని నటీనటులకు మంచి పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలు లభించాయి. ప్రతి పాత్రకు సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం బాగుంది.
‘రేవు’ సినిమాలోని పాటలు కూడా కొంతమేర ఆకట్టుకుంటాయి. అయితే, నేపథ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. క్లైమాక్స్ సీన్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు సింపుల్ కథను ఎంచుకోవడం.. దానిని సాగదీసినట్లుగా స్క్రీన్‌ప్లే నడిపించడం ప్రేక్షకులను విసిగిస్తుంది. కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకుంటాడు. ఇక హీరో పాత్రను ఎలివేట్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్‌లో కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది. అటు పాటలు కూడా వినసొంపుగా ఉండవు.
ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ను ఆసక్తికరంగా రాసుకున్నా, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఫెయిల్ అయ్యింది. సినిమాలో డ్రామా డోస్ ఎక్కువయ్యిందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అటు సెకండాఫ్‌లో విలనిజాన్ని మరీ ఓవర్‌గా చూపెట్టేందుకు దర్శకుడు ప్రాధాన్యతను ఇచ్చాడు. దీంతో కథ ట్రాక్ తప్పినట్లుగా కనిపిస్తుంది.
ఎమోషనల్ సీన్స్‌కి స్కోప్ ఉన్నా, కేవలం ఓ పాటలోనే దానిని చూపెట్టారు. ఇది ప్రేక్షకులను కొంతమేర నిరాశకు గురిచేస్తుంది. గంగయ్య పాత్రను ఇంకా బాగా డిజైన్ చేసుకుని ఉండాల్సింది. హీరో పాత్రకు కూడా కావాల్సినంత స్టఫ్ ఇవ్వలేదనే చెప్పాలి.
మొత్తంగా, ‘రేవు’ చిత్రాన్ని రా అండ్ రస్టిక్‌గా ప్రెజెంట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించినా.. స్లో నెరేషన్, సాగదీసిన స్క్రీన్‌ప్లే, ఆకట్టుకోని మ్యూజిక్ కారణంగా ఈ సినిమా ఓ యావరేజ్ చిత్రంగా నిలిచింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు హరినాథ్ పులి ‘రేవు’ సినిమాకు ఎంచుకున్న నేపథ్యం బాగుంది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ రొటీన్ రివెంజ్ డ్రామాగా ఇది మిగిలింది. నటీనటుల నుంచి రస్టిక్ పర్ఫార్మెన్స్‌లు రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు జాన్ కె జోసెఫ్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి. కానీ, వైశాఖ్ మురళీధరన్ బీజీఎం ఇంప్రెస్ చేస్తుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా బాగుంది. కోస్తా తీర అందాలను చక్కగా చూపెట్టారు. చేపల వేటకు వెళ్లే సీన్స్ వంటివి చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ వర్క్ ఈ సినిమాకు మేజర్ బ్యాక్‌డ్రాప్‌గా నిలిచింది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలోని ప్రతి ఫ్రేం కూడా బాగా కనిపిస్తుంది.
తీర్పు:
‘రేవు’ సినిమా రా అండ్ రస్టిక్ రివెంజ్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. నటీనటుల న్యాచురల్ పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి. బీజీఎం బాగున్నా, మ్యూజిక్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఓవరాల్‌గా రివెంజ్ డ్రామాలు ఇష్టపడేవారు ‘రేవు’ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team