ఇన్‌డైరెక్టుగా డిబేట్లు పెట్టుకోమంటున్న వర్మ ?

ఇన్‌డైరెక్టుగా డిబేట్లు పెట్టుకోమంటున్న వర్మ ?

Published on Jan 19, 2021 3:00 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య తన సినిమాల విషయంలో కథ మీద ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా ప్రమోషన్ల మీద మాత్రం గట్టిగా దృష్టి పెడుతున్నారు. అది కూడ వివాదాల రూపంలోనే. ఈమధ్య ఆయన తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్, దిశ ఎన్ కౌంటర్, మర్డర్’ లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లలో వివాదాస్పద అంశాలను జొప్పించి విడుదలచేసి టీవీలకు ఎక్కడం ఆయన స్ట్రాటజీ. ఈ వివాదాలే జనం నోళ్ళలో నాని నాని ఆయన సినిమాకు పబ్లిసిటీని తెచ్ఛాయి.

సినిమా విడుదలయ్యాక ఫలితం తలకిందులైన సందర్భాలే ఎక్కువైనా ఈ పబ్లిసిటీ స్టంట్ల ద్వారానే ఉనికిని చాటుకుంటున్నారు ఆయన. వర్మ తాజాగా ‘ఇది మహాభారతం కాదు’ అనే వెబ్ సిరీస్ ను ప్రకటించారు. ఆ వెబ్ సిరీస్ గురించి పరిచయం చేస్తూ ‘టైటిల్లో చెప్పినట్టే ఈ వెబ్ సిరీస్ మహాభారతం కాదు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న టౌన్లో మహాభారతంలోని పాత్రలను పోలిన కొందరికి మహాభారతం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ప్రవర్తించారు అనేదే ఈ కథ. కాబట్టి ధర్మవాదులు, ఆవేశపరులు అతిగా ఆలోచించి టీవీల్లో అరిచి అరిచి గొంతులు పోగొట్టుకోనవసరం లేదు. ఎందుకంటే టైటిల్లోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నాం. ఇది మహాభారతం కాదు’ అంటూ అరిచి మరీ చెప్పారు. పాత్రలు, పరిస్థితులు మహాభారతంలోనివే కానీ ఇది మహాభారతం కాదు అంటుండటం చూస్తే ఇన్‌డైరెక్టుగా డిబేట్లకు రెడీగా ఉండమని గొంతు చించుకుని మరీ హింట్ ఇస్తున్నారనే అనుమానం కలుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు