కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును ప్రకటించింది.
అయితే, ఈ హీరో తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. ‘‘భారతదేశాన్ని కొన్ని చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన సినిమాలను అంతర్జాతీయంగా గౌరవిస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అందుకే మన సినిమాలకు ఇతర దేశాల్లో ఇంతటి ఆదరణ లభిస్తుంది. మన దేశం గర్వపడేలా సినిమాలను చేయాలని అనుకుంటున్నాను.’’ అని రిషబ్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
దీంతో ఇప్పుడు బీటౌన్ ఆయనపై మండిపడుతోంది. ‘కాంతార’ చిత్రానికి బాలీవుడ్ జనాలు సైతం ఆదరణ చూపెట్టారని.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి రిషబ్ ఇలా మాట్లాడటం సరికాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక నెట్టింట ఈ విషయంపై పెద్ద చర్చలు సాగుతున్నాయి.