పండుగ సీజన్ ఓ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు పోటీ పడుతుంటాయి. పండుగ సీజన్ లో సినిమాను రిలీజ్ చేస్తే వసూళ్లు బాగా వస్తాయని.. అధిక సంఖ్యలో ప్రేక్షకులు కూడా సినిమాలను చూసినట్లుగా ఉంటుందని మేకర్స్ ఈ సీజన్ ను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇక లాంగ్ వీకెండ్, పబ్లిక్ హాలీడేస్ కి కూడా వారు ప్రాధాన్యమిస్తారు. కాగా, ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం సెలవుతో పాటు లాంగ్ వీకెండ్ వస్తుండటంతో పలు చిత్రాలు ఆ డేట్ పై కన్నేశారు.
ఇప్పటికే ఆ డేట్ ను తమ రిలీజ్ డేట్ గా లాక్ చేసుకున్నాయి పలు సినిమాలు. ఈ జాబితాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తొలుత ఈ డేట్ ను రిలీజ్ డేట్ గా ప్రకటించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వాల్యూ రూ.40 కోట్లుగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటుపై మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ రూ.30 కోట్ల డీల్ తో అదే రోజున రానుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ తెలుగు థియేట్రికల్ రైట్స్ విలువ రూ.6 కోట్లతో ఆగస్టు 15న రానుంది.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు సినిమాలు ఏకంగా రూ.80 కోట్ల బిజినెస్ జరుపుకుని బరిలో పోటీకి దిగుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేస్తారో.. ఏ సినిమాను తిరస్కరిస్తారో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.