IPL 2025 లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టులో భారీ మార్పు చోటు చేసుకుంది. ఈ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఎంఎస్.ధోనికి అప్పగించారు. ఈ సీజన్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి ఎముక విరిగిన కారణంగా ఆయన టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని మరోసారి యెల్లో ఆర్మీని నడిపించనున్నాడు.
సీజన్ ప్రారంభంలో జట్టు పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. CSK 2025 ఐపీఎల్‌ను ముంబై ఇండియన్స్‌పై విజయంతో ఆరంభించినా, దానిని కంటిన్యూ చేయలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో 50 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో లోపాలను బయటపెట్టింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులు, మతీషా పతిరణ వంటి యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ, స్థిరత్వం కోసం పోరాడుతోంది.
ధోని నాయకత్వంలో CSK ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అతని వ్యూహాత్మక నైపుణ్యం జట్టుకు బలాన్ని అందించడమే కాకుండా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. అయితే, కేవలం కెప్టెన్ మారితేనే విజయం అందుకోలేరు. పాయింట్ల టేబుల్‌లో మెరుగైన స్థానం కోసం జట్టు స్థిరమైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అటు 43 ఏళ్ల వయస్సులో ధోని బ్యాటింగ్ ఫామ్‌పై కూడా ప్రెషర్ పడుతుంది. జడేజా, డెవాన్ కాన్వే వంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే, ధోని నాయకత్వంలో సీఎస్‌కే తిరిగి ఫామ్‌లోకి వచ్చి టైటిల్ రేసులో నిలవచ్చని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.