సమీక్ష : శబ్దం – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా !

Sabdham Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆది, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, MS బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న
దర్శకుడు : అరివళగన్ వెంకటాచలం
నిర్మాత : 7G శివ
సంగీతం : తమన్ ఎస్
ఛాయాగ్రహణం : అరుణ్ బత్మనాబన్
కూర్పు : ఎస్. థమన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఆది పినిశెట్టి హీరోగా, దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శబ్దం. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

హోలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్లు చనిపోతూ ఉంటారు. ఆ మరణాలతో కాలేజీలో దెయ్యాలు ఉన్నాయనే రూమర్ బాగా వైరల్ అవుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ని పిలుస్తారు. వ్యోమా కాలేజీలో అడుగు పెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) అసలు ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే థీసిస్ చేస్తూ ఉంటుంది. కానీ, అవంతిక ప్రవర్తనలో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాలేజీలో దీపిక అనే మరో అమ్మాయి కూడా మరణిస్తుంది. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు ?, నిజంగానే ఆ కాలేజీలో దెయ్యాలు ఉన్నాయా ?, ఇంతకీ గతంలో ఆ కాలేజ్‌లో ఏం జరిగింది?, ఈ కథలో డయానా (సిమ్రాన్) పాత్ర ఏమిటి ?, ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి ?, అలాగే న్యాన్సీ డేనియల్ (లైలా) పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం సాగింది. సినిమాలో అరివళగన్ దర్శకత్వ పనితనం చాలా బాగుంది. అతని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ సినిమా స్థాయిని పెంచాయి. పైగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ను కూడా అరివళగన్ చాలా బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా కథలోని కోర్ ఎమోషన్, ఒక మనిషిని కాపాడాలనే తాపత్రయం,ఆత్మల లక్ష్యం నెరవేరాలనుకునే హీరో ఆది క్యారక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. వ్యోమా క్యారక్టర్ లో ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆది కోసమే వ్యోమా క్యారెక్టర్ డిజైన్ చేసారా అనేంతలా అతను తన క్యారక్టర్ లో ఒదిగిపోయాడు.

దానికి తోడు హార్రర్ సీన్స్ లోనూ అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ ఆది తన నటనతో ఆకట్టుకున్నాడు. మరో కీలక పాత్రలో కనిపించిన సిమ్రాన్ తో పాటు చాలా ఏళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన లైలా కూడా తన నటనతో మెప్పించారు. హీరోయిన్ గా లక్ష్మి మీనన్ కరెక్ట్ గా ఆమె పాత్రకు సెట్ అయింది. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. అభినయ, రెడీన్ కింగ్ స్లే, రాజీవ్ మీనన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మొత్తానికి ఈ ‘శబ్దం’ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కొత్తగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ అలరించాయి. అదే విధంగా సినిమా నేపథ్యం, హీరో క్యారెక్టర్, కథలోని ఎమోషనల్ ట్రాక్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దెయ్యాల కథలకు ఓ రొటీన్ ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకుల్ని భయపెట్టే దెయ్యాలు.. సెకండాఫ్‌కి చప్పబడిపోతాయి. అవి దెయ్యాలుగా మారేందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే ఉంది. అయితే, కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, ఈ శబ్దం సినిమా సెకండ్ హాఫ్ లో అది మిస్ అయ్యింది.

ఎంతైనా దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కాకపోతే, శబ్ధంలో హారర్ ఎఫెక్ట్స్ కూడా కొత్తగా ఉన్నాయి. కానీ రెండో భాగంలో స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా లేకపోవడం, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఆసక్తి కూడా మిస్ కావడం కారణంగా ఈ సినిమా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ అరుణ్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు 7 జి శివ ,భాను ప్రియ శివ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘శబ్దం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, కథనం స్లోగా సాగడం, కొన్ని కీలక కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version