మన తెలుగు నేల ప్రముఖ వ్యాపార వేత్త, ఈటీవీ ఛానెల్ అధినేత, ప్రముఖ నిర్మాత అలాగే ఈనాడు దినపత్రిక సృష్టికర్త గా దిగ్గజం రామోజీరావు గారు ఎలాంటి ముద్ర వేశారో అందరికీ తెలిసిందే. రంగం ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మాత్రమే ఇవ్వడం ఆయన ఆనవాయితీగా పెట్టుకొని ఎన్నో మన్ననలు పొందారు.
అలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహా టెలివిజన్ రంగంలో కూడా ఒక కొత్త ఒరవడి సృష్టించారు. కానీ ఇప్పుడు ఆయన ఇకలేరు అనే విషాద వార్త తెలుగు ప్రజల్లో టెలివిజన్ రంగం సహా సినీ వర్గాల్లో విషాద ఛాయలు తీసుకొచ్చింది. నిన్న రాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు.
అలా నానక్ రామ్ గూడ స్టార్ హాస్పిటల్ లో చేర్చగా వెంటిలేటర్ పై చికిత్స అందించే ప్రయత్నం వైద్యులు చేశారు. అయితే హై బీపీ సహా శ్వాస అందుకోవడంలో ఇబ్బంది నెలకొనడంతో ఆయన తన 4 గంటల 50 నిమిషాల సమయంలో తన 88వ ఏట తుది శ్వాస విడిచారు. దీనితో తీవ్ర విషాదం ఇప్పుడు నెలకొంది.
రామోజీ రావు గారు కృష్ణ జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అక్కడ నుంచి తన స్వశక్తితో ఎదిగి ప్రపంచంలోనే అతి పెద్ద థీమ్ పార్క్ ఫిల్మ్ స్టూడియో కట్టించారు. ఈనాడు ఛానెల్, పేపర్ తో పాన్ ఇండియా వైడ్ గా వ్యాపించారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా పచ్చళ్ళు, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై మంచి సినిమాలు కూడా అందించారు. ఇలా వారు టచ్ చేయని రంగం లేదు. మరి వారికి చెరుకూరి సుమన్, కిరణ్ ప్రభాకర్ ఇద్దరు సంతానం కాగా వారిలో అపారమైన టాలెంట్ కలిగిన సుమన్ కొన్నాళ్ల కితమే అనారోగ్యంతో కన్ను మూసారు.
ఇది రామోజీరావు గారి జీవితంలో తీవ్ర విషాదంగా మారింది. ఇలా ఎన్నో ఆటు పోట్లు చూసిన వారు అనేక అవార్డులు కూడా అందుకున్నారు. 5 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అలాగే ఒక నేషనల్ అవార్డ్ సహా 2016 లో భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ కూడా ఆయన అందుకున్నారు.
ఆయన జీవితం ఎంతోమందికి ప్రేరణగా నిలిచే పాఠం. ఆయన లేకపోడం అనేది హృదయ విదారకమే. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని మా 123తెలుగు టీం ఆకాంక్షిస్తుంది. ఓంశాంతి.