విడుదల తేదీ : అక్టోబరు 13, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని, రాజశేఖర్, తదితరులు
దర్శకుడు : రాజశేఖర్ సుద్మూన్
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ
సంగీతం: జస్వంత్ పసుపులేటి
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్ సూద్మూన్
ఎడిటర్: రాజశేఖర్ సూద్మూన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రాయలసీమలోని సగిలేరు అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ సగిలేరు గ్రామం ప్రెసిడెంట్ చౌడప్ప (రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ దొరసామి (రమేష్) లు ఆ గ్రామానికి పెద్దలు. అలాగే వారిద్దరూ మంచి స్నేహితులు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం), దొరసామి కూతురు కృష్ణ కుమారి (విషిక కోట) ప్రేమలో పడతారు. మరోవైపు ఆ ఊరిలో కొన్నేళ్లుగా వర్షాలు పడక అనావృష్టి తాండవం చేస్తూ ఉంటుంది. దాంతో ఆ ఊరి గంగాలమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలు తీర్మానం చేస్తారు. మరి ఆ గంగాలమ్మ జాతరలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, కుమార్ – కృష్ణ కుమారి ప్రేమకు అనుకోని ఏర్పడిన అవాంతరం ఏమిటి ?, అసలు వీరి ప్రేమకు ఆ ఊరి గంగాలమ్మ జాతరకు ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు ఈ కథలో చోటు చేసుకున్న మలుపులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా మంచి నేటివిటీతో పాటు సహజమైన పాత్రల ఆధారంగా దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్ ఈ స్క్రిప్ట్ ను రాసుకోవడం సినిమాకి ప్లస్ అయింది. ఓ గ్రామం చుట్టూ దర్శకుడు అల్లిన డ్రామా కూడా బాగానే ఉంది. హీరోగా రవి మహాదాస్యం తన యాక్టింగ్ తో తన పాత్రలో చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా కనిపించిన విషిక లక్ష్మణ్ కూడా పర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో ఆమె చాలా సహజంగా నటించింది.
కీలక పాత్రల్లో నటంచిన నరసింహా ప్రసాద్ పంతగాని, రాజశేఖర్ తమ పాత్రలకు తగ్గట్లుగా చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన ప్రధానమైన పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా కథా నేపథ్యానికి తగ్గట్టు సాగే సాంగ్ చాలా బాగుంది. ఇక గంగాలమ్మ జాతర్లో దొరసామిని చౌడప్ప నరికేసే సన్నివేశం, అలాగే క్లైమాక్స్ ఈ కథలో బలమైన సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథలో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఏ సీన్ కి ఆ సీన్ పర్వాలేదు అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగానే పెట్టారు గానీ, అది కూడా థ్రిల్ చేయలేకపోయింది.
మొత్తమ్మీద దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. అవసరానికి మించి ల్యాగ్ సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తుంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువవడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే హీరో కేవలం బాధ పడటం తప్ప.. ఇంకేం చేయలేక పోవడం వంటి అంశాలు కూడా అసలు బాగాలేదు.
నిజానికి ప్రధాన కథలో పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా… దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్ మాత్రం ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఊరు అన్నాక.. అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ దర్శకుడు మాత్రం చికెన్ కోసం పడిగాపులు కాసే వ్యక్తి చుట్టే కథనాన్ని నడపడం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు జస్వంత్ పసుపులేటి అందించిన పాటలు బాగానే ఉన్నాయి. మొదటి మరియు చివరి పాట ఆకట్టుకుంటుంది. అదే విధంగా సనల్ వాసుదేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. రాజశేఖర్ సూద్మూన్ ఎడిటింగ్ బాగాలేదు. సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా తానే అందించాడు రాజశేఖర్ సూద్మూన్. ఈ క్రాఫ్ట్ లోను ఆయన ఆకట్టుకోలేకపోయాడు. పల్లెటూరి విజువల్స్ ను సహజంగా చాలా అందంగా చూపించొచ్చు. కానీ, రాజశేఖర్ సూద్మూన్ అందులోనూ విఫలం అయ్యాడు. ఇక నిర్మాతలు అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ ‘సగిలేటి కథ’ ఆకట్టుకునే విధంగా లేదు. కాకపోతే, కోడికూర కోసం పడిగాపులు కాసే సీన్స్, పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడ పరిస్థితులను సహజంగా చూపించడం, అలాగే జాతర జరగపోతే ఊరిలో జరిగే అల్లకల్లోలం వంటి అంశాలు సినిమాలో బాగానే ఉన్నాయి. కానీ, ఓవరాల్ గా రాయలసీమ సంస్కృతి, ఆచార వ్యవహారాలను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా.. సగటు ప్రేక్షకుడిని కూడా ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team