సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. గతేడాది ‘బ్రో’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు ఓ సరికొత్త కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. కొత్త డైరెక్టర్ రోహిత్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
సాయి దుర్గ తేజ్ ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమైనదని.. ప్రేక్షకుల ఆశీస్సులు కోరుతున్నట్లుగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘అతడి రాకకోసం భూమి ఎంతగానో వేచి చూస్తుంది..” అనే లైన్ తో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాను ‘హను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా రానున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాలో మిగతా క్యాస్టింగ్ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.