విడుదల తేదీ : జూలై 12, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకులు: పద్మారావు అబ్బిశెట్టి(పండు)
నిర్మాత : ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లి
సంగీత దర్శకులు: ఎం.ఎబెనెజర్ పాల్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభు
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్
సంబంధిత లింక్స్:ట్రైలర్
రాజా రవీంద్ర మెయిన్ లీడ్‌లో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మార్క్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
పద్మారావు అబ్బిశెట్టి(పండు) ఎంచుకున్న కథ బాగుంది. ఇందులోని మెయిన్ పాయింట్ సరికొత్తగా అనిపిస్తుంది. ఓ మధ్య తరగతి ఫ్యామిలీలో ఇలాంటి సమస్య వస్తే, తప్పించుకునే వారే ఎక్కువ కనిపిస్తారు. కానీ, కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ ఆ సమస్యను అధిగమించిన తీరు అద్భుతం. ఇక తన పిల్లల కోసం కృష్ణ కుమార్ ఓ మధ్య తరగతి తండ్రిగా పడే తపన, ఆరాటం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇక సినిమాలోని కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తాలుకా మనషుల్లో ఏర్పడే సమస్యలను వారు సందర్భానుసరం పరిష్కరించే తీరును బాగా చూపెట్టారు. ముఖ్యంగా అనుపమ క్యారెక్టర్‌కు సంబంధించిన సమస్యను భూతద్దంలో కాకుండా, సమాజంలో అదొక కామన్ పాయింట్‌లా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. అటు తల్లిదండ్రులుగా కృష్ణ కుమార్ అతడి భార్య తీసుకునే నిర్ణయాలు, వారు తమ పిల్ల కోసం పడే ఆరాటం కలగలిసి ప్రేక్షకులకు నచ్చుతుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ బాగున్నా, దాన్ని సాగదీస్తూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు సినిమాకు మైనస్ అని చెప్పాలి. అనుపమ పాత్రకు సంబంధించిన సమస్య వరకు బాగానే హ్యాండిల్ చేసిన దర్శకుడు.. అర్జున్, సాయిల సమస్యను చాలా తేలికగా హ్యాండిల్ చేశాడు. ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటున్నా, వాటికి సినిమా చూపెట్టిన ఫలితాలు సెట్ కావు.
ఇక ఈ సినిమాలో రాజా రవీంద్ర పాత్రను పూర్తిగా సీరియస్ మోడ్‌లోనే రన్ చేయడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఓ తండ్రి పిల్లల వరకు సీరియస్‌గా ఉంటూనే వారితో సరదాగా కూడా ఉండాలి. కానీ సినిమాలో అలాంటి సందర్భాలు చాలా తక్కువ. అటు తల్లి పాత్రను కేవలం నామమాత్రానికే పరిమితం చేశారు. ఇక సినిమాలోని ఫస్టాఫ్ లో కథలోకి లీనమవడంలో ఎక్కువ సమయం తీసుకుంటే, సెకండాఫ్ లో స్లో స్క్రీన్ ప్లే సినిమాపై ఆసక్తిని పూర్తిగా తగ్గిస్తుంది. మంచి పాయింట్లు కూడా మిస్ అయ్యేలా చేస్తుంది ఈ స్క్రీన్ ప్లే. ఇక సంగీతం కూడా ఎక్కడా ఆకట్టుకోకపోవడం ఈ సినిమాకు మైనస్ గా నిలిచింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి(పండు) తొలి సినిమాతోనే మంచి కథను పట్టుకున్నాడు. అయితే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంపై మరింత దృష్టి పెట్టి ఉంటే, సారంగదిరియా ఓ మంచి చిత్రంగా నిలిచేది. సిద్ధార్థ స్వయంభు సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సినిమాలోని అన్ని ఫ్రేమ్స్ చాలా చక్కగా చూపెట్టారు. ఎం.ఎబెనెజర్ పాల్ అందించిన సంగీతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
సారంగదరియా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఎమోషన్స్‌ను ప్రెజెంట్ చేసిన మూవీగా నిలిచింది. అయితే, సినిమాలోని స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి వారికి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తుంది. దీనికి తోడుగా ఏమాత్రం ఆకట్టుకోని మ్యూజిక్ వారిని పరీక్షిస్తుంది. అయితే, సినిమాలో మునుపెన్నడూ టచ్ చేయని పాయింట్‌ను ఎగ్జిక్యూట్ చేసిన తీరు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team