విడుదల తేదీ : మార్చి 08, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : జి.వి.ప్రకాష్, అపర్ణ బాలమురళి తదితరులు.
దర్శకత్వం : రాజీవ్ మీనన్
నిర్మాత : లతా మీనన్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్
ఎడిటర్ : ఆంటోనీ
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జి.వి.ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా రూపొందిన సినిమా ‘సర్వం తాళమయం’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
పీటర్ (జి.వి.ప్రకాశ్) డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలు తయారు చేసే ఒక వెనుకబడిన దళిత సామజిక వర్గానికి చెందిన కుర్రాడు. అతను తమిళ హీరో విజయ్ కు వీరాభిమాని. ఆ అభిమానం మత్తులో తన జీవితాన్ని వృధా చేస్తూ.. కాలం గడుపుతున్న అతని జీవితంలోకి కర్ణాటక సంగీతం ప్రవేశిస్తోంది. కర్ణాటక సంగీతంలో ఆరితేరిన ప్రతిష్టాత్మక కర్నాటక గురువు మరియు సంగీత విద్వాంసుడు (నెడుముడి వేణు) దగ్గర శిష్యుడిగా చేరతాడు. ఆ తరువాత కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని కష్టాలు వచ్చినా సంగీతం మీద తన ఇష్టాన్ని.. సంగీతంలో తన శిక్షణను మాత్రం ఆపడు. మరి పీటర్ తాను అనుకున్నట్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడా ? తన గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడా ? చివరికి సంగీత విద్వాంసుడుగా మారతాడా ? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో కర్ణాటక సంగీతం గొప్పతనాన్ని అలాగే సామాజికంగా దళిత వర్గానికి చెందిన వాళ్ళకు ఎదురై అవమానాలను ఇబ్బందులను సినిమాలో చాలా చక్కగా చూపించారు. డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడుగా నటించిన జి.వి.ప్రకాశ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అదేవిధంగా సంగీత విద్వాంసుడుగా మారుతున్న క్రమంలో అతని నటన కూడా పాత్రకు అనుగుణంగా మారుతూ ఆకట్టుకుంటుంది.
ఇక హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి ఈ చిత్రంలో సారా అనే నర్సు పాత్రలో నటించింది. హీరోతో సాగే లవ్ ట్రాక్ లో అలాగే హీరోను మోటివేట్ చేసే సీన్ లో ఆమె నటన చాలా బాగుంది. సినిమాలో విలన్ లక్షణాలు ఉన్న ప్రతికూల పాత్రలో నటించిన సీనియర్ నటుడు వినీత్ కూడా చాల కాలం తరువాత మంచి పాత్రలో కనిపించాడు. సంగీత విద్వాంసుడుగా నటించిన నెడుముడి వేణు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మిలిగిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఏం తెలియని ఓ కుర్రాడు సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ.. కథాకథనాలు మాత్రం నెమ్మదిగా సాగుతాయి. ఇక హీరో సంగీతం నేర్చుకునే క్రమంలో అతను పడిన ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలను, ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ.. దర్శకుడు మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.
అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా మరియు ప్రేరణ కలిగించే విధంగా నడిపిన దర్శకుడు, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీస్తోంది. ఓవరాల్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.
సాంకేతిక వర్గం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే..రాజీవ్ మీనన్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. అయితే కథనాన్ని బాగా స్లోగా నడిపినా.. సంగీతానికి సంబంధించిన బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. అలాగే ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జి.వి.ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా రూపొందిన ఈ ‘సర్వం తాళమయం’ చిత్రం ఖచ్చితంగా ఒక వర్గం ప్రేక్షకులనే టార్గెట్ చేసుకుని తెరకెక్కినట్లు అనిపిస్తోంది. ఏం తెలియని ఓ కుర్రాడు సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల మరియు బాధల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం, కీలకమైన సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా.. వాట్ని సింపుల్ గా నడపడం, ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ప్రతికూలాంశాలుగా నిలుస్తాయి. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team