సమీక్ష: “సత్యం సుందరం” – కదిలించే తెలియని పరిచయం

సమీక్ష: “సత్యం సుందరం” – కదిలించే తెలియని పరిచయం

Published on Sep 29, 2024 2:02 AM IST

Sathyam Sundaram movie review

Sathyam Sundaram Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి కొండే తదితరులు

దర్శకుడు : సి. ప్రేమ్ కుమార్

నిర్మాతలు : జ్యోతిక సదన, సూర్య శివకుమార్

సంగీత దర్శకుడు : గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ : మహేంద్రన్ జయరాజు

ఎడిటర్ : ఆర్.గోవిందరాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు కార్తీ, అరవింద స్వామి నటించిన ఎమోషనల్ డ్రామా “సత్యం సుందరం” కూడా ఒకటి. మరి తమిళ్ లో ఒక రోజు ముందే విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగులో నేడు రిలీజ్ అయ్యింది. మరి టీజర్, ట్రైలర్ లతో మెప్పించి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. గుంటూరులో ఉండే సత్యమూరి (అరవింద స్వామి) కి తన చిన్న నాటి నుంచి ఉన్న తరతరాల సొంత ఇల్లు అంటే ఎంతో ఇష్టం కానీ కొన్ని కారణాలు చేత ఆ ఇంటిని తన కుటుంబం కోల్పోయి విశాఖపట్నంలో సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అయితే 1996లో విశాఖకు వచ్చేసిన సత్యం మళ్ళీ తన చెల్లెలు పెళ్లి కోసం తన సొంతూరుకు మనసులో వెళ్లాలని ఉన్నా ఇష్టం లేకుండానే వెళ్లాల్సి వస్తుంది. అలా పెళ్ళికి వెళ్లిన తర్వాత తాను బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం(కార్తీ) పరిచయం అవుతాడు. అక్కడ నుంచి వీరిద్దరి పరిచయం ఎలా సాగింది. సత్యంకి మొదట్లో చికాకుగా అనిపించినా సుందరం ఎలా తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు? తనకి ఎవరో తెలియని సుందరంని సత్యం ఎలా ఫేస్ చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

టాలెంటెడ్ నటుడు కార్తీ తన కెరీర్లో చాలా సహజమైన సినిమాలను తనదైన నాచురల్ పెర్ఫామెన్స్ తో అందించాడు. ఇంకా తనపై పల్లెటూరు నేపథ్యం సినిమాలు అంటే అవి మరింత సహజంగా ఉంటాయి. అలా తన నుంచి వచ్చిన మరో అందమైన పల్లెటూరి సినిమా ఇది కూడా అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వాటి అన్నిటికంటే ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తుంది.

కార్తీ ఎమోషనల్ పెర్ఫామెన్స్ అయితే తన ఫ్యాన్స్ ని న్యూట్రల్ ఆడియెన్స్ ని కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. తన పాత్రలోని అమాయకత్వం, మాటకారితనం తన లుక్స్ తో సుందరం అనే పాత్రకి కార్తీ ప్రాణం పోసాడని చెప్పాలి. అలాగే తన పాత్ర నుంచి ఎంత ఫన్ కనిపిస్తుందో అంతకు మించిన భావోద్వేగం కూడా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటుంది.

ఇక తనతో పాటుగా ఆద్యంతం సినిమాలో సాగే మరో ముఖ్య పాత్రలో అరవింద స్వామి కూడా తనదైన పెర్ఫామెన్స్ ని అందించారు అని చెప్పాలి. తనపై కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేసే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తన చెల్లెలికి బంగారు ఆభరణాలు తొడిగే సీన్ కానీ సినిమా ప్రీ క్లైమాక్స్ లో తన భార్యతో కార్తీ కోసం చెప్పే సన్నివేశంలో కానీ అరవింద స్వామి ఇచ్చిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే కార్తీతో మంచి ఫన్ సీన్స్ బాగున్నాయి.

ఇక వీటితో పాటుగా దర్శకుడు చెప్పాలనున్న ఎమోషనల్ ప్లే ఆడియెన్స్ లో బాగా వర్క్ అవుతుంది అని చెప్పవచ్చు. ఎవరో మనకి తెలియని వ్యక్తి కానీ మనం వాళ్లకి బాగా తెలిసి వారు మనపై చూపించే ప్రేమ, అభిమానం ఎంతో సహజంగా కల్మషం లేకుండా ఈ చిత్రంలో చూపించబడ్డాయి. ఇవి ఖచ్చితంగా ఆడియెన్స్ ని కదిలిస్తాయని చెప్పాలి.

ఇక సినిమాలో కనిపించిన శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు. అలాగే తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. డబ్బింగ్ ఒకటే కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసుకున్న ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తా క్షుణ్ణంగా కనిపిస్తాయి ఈ విషయంలో తెలుగు డబ్బింగ్ టీంకి మంచి మార్కులు ఇవ్వాలి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం కొంచెం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయని చెప్పాలి. ముఖ్యంగా సీనియర్ నటుడు రాజ్ కిరణ్ పై కొన్ని సన్నివేశాలు మరీ అంత ఆకట్టుకోవు. అలాగే సినిమా కొన్ని చోట్ల స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఒక ఎమోషనల్ సెకండాఫ్ తో అయితే ఫస్టాఫ్ కొంచెం ల్యాగ్ గా అనిపిస్తుంది.

ఇంకా సినిమా స్టార్టింగ్ లో కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ డెప్త్ కోసం కొంచెం సాగదీసిన భావన కూడా కలిగించవచ్చు. సో వీటితో ఇలాంటి కొన్ని సన్నివేశాలు అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ వంటి వాటిని ఆశించే వారు కూడా ఈ చిత్రానికి కొంచెం దూరంగా ఉంటే మంచిది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ లో తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త మాత్రం చాలా బాగుంది. చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా మేకర్స్ చాలా బాగా చేశారు. ఇంకా సినిమాలో సంగీతం వెన్నుముక అని చెప్పాలి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా చాలా ఇంపుగా సందర్భానుసారం వచ్చే పాటలు చాలా బాగున్నాయి. ఇందులో గోవింద్ వసంత అద్భుతమైన వర్క్ ని అందించారు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. దాదాపు మూడు గంటల సినిమా అయినా బోర్ లేకుండా కట్ చేశారు.

ఇక దర్శకుడు సి ప్రేమ్ కుమార్ విషయానికి వస్తే.. 96 లాంటి ఎమోషనల్ డ్రామాని ఇచ్చిన తన నుంచి ఇది మరో బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. కేవలం కొన్ని సీన్స్ స్లోగా అనిపించాయి తప్పితే మిగతా కథనం కానీ తాను చూపించిన ఎమోషన్స్ కానీ సినిమాలో చాలా బాగున్నాయి. హృదయాన్ని హత్తుకుంటాయి. సినిమాలో కనిపించే నటీనటుల్ని చూస్తే మనలోనో మన ఊర్లోనో ఒకర్నో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా సినిమాని మాత్రం మంచి ఎమోషన్స్ తో తాను తీసుకెళ్లారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే “సత్యం సుందరం” అనే సినిమా మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక హత్తుకునే ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. కార్తీ, అరవింద స్వామిల ఎమోషనల్ పెర్ఫామెన్స్ లు దర్శకుడు రాసుకున్న కథనం అందులోని కదిలించే భావోద్వేగాలు సినిమాలో బాగా వర్కౌట్ అవుతాయి. ఎలాంటి హంగామా లేకుండా హృదయానికి తేలిక పరిచే సినిమా చూడాలి అనుకునేవారికి సత్యం సుందరం ఈ వారంలో మంచి ఛాయిస్ గా నిలుస్తుంది. అలాగే కుటుంబంతో సహా ఈ చిత్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్స్ లో వీక్షించవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు