సత్యరాజ్.. ప్రస్తుతం సౌతిండియన్ సినిమాలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బ్రహ్మోత్సవం’, ‘నేను శైలజ’ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన సత్యరాజ్, అన్నింటికంటే ముఖ్యంగా ‘బాహుబలి’లోని కట్టప్ప అనే పాత్రే తన సొంతపేరు అయ్యేంతగా పాపులర్ అయిపోయారు. ఇక తాజాగా ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘జాక్సన్ దొరై’ (తెలుగులో ‘దొర’)అనే సినిమా ఈ శుక్రవారం (జూలై 1న) విడుదలకు సిద్ధమైంది.
ధరణి ధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యరాజ్ ఓ దయ్యంగా కనిపించనుండడం విశేషంగా చెప్పుకోవాలి. జాక్సన్ దొర అనబడే ఓ బ్రిటీష్ దయ్యానికి, ఇక్కడి దయ్యానికి మధ్యన జరిగే ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కింది. దయ్యంగా నటించడం చాలా కొత్తగా ఉందని తెలుపుతూ సత్య రాజ్ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుమారుడు సిబి ఈ సినిమాలో హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదలవుతోంది.