తెలుగు సినిమాలతో పాటు, హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ, ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్ కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా, హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అతి త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయులు సమీర్ పెనకలపాటి ఈ రామ గీతాన్ని ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో రూపొందించారు.
ఈ గీతానికి లభిస్తున్న అపూర్వ స్పందనపై సంగీత సారధి సత్య కశ్యప్ సంతోషంతో తబ్బిబ్బు అవుతున్నారు. సంగీత దర్శకుడిగా తన జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నానని ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నాడు!!
స్వతహా రామ భక్తుడయిన సత్య కెరీర్ శ్రీకారం చుట్టుకున్నదే “శ్రీరామ స్వరాలు” అనే ప్రయివేట్ ఆల్బమ్ తో కావడం గమనార్హం. హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ మ్యూజికల్ కాలేజ్ లో ఆరేళ్ళ డిప్లొమా కోర్స్ చేసిన ఈ శ్రీకాకుళం చిన్నోడు… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి” చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. తెలుగు, హిందీతోపాటు తమిళ, కన్నడ, ఒరియా చిత్రాలకు సైతం పని చేసిన సత్య, అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్ కు స్వర సారధ్యం చేసే సువర్ణావకాశం ఇచ్చిన నిర్మాత సమీర్ పెనకలపాటి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆల్బమ్ రూపకల్పనలో ఎంతో శ్రమించిన ఎడిటర్ యువర్స్ ఉన్ని కి కూడా ఈ విజయంలో తగిన పాత్ర ఉందని చెప్పే సత్య కశ్యప్, వీటన్నిటి కంటే శ్రీ రాముని కరుణాకటాక్షాల వల్లే అయోధ్య శ్రీరామ్ అసాధారణ విజయం సాధిస్తున్నదని అంటాడు. అచంచల భక్తిశ్రద్ధలతో రూపొందిన అయోధ్య శ్రీరామ్ గీతాన్ని సత్య కశ్యప్ తో కలిసి, చిన్మయి, స్నిఖిత, శ్రాగ్వి ఆలపించారు. తెలుగులో ఈ గీతానికి చిరంజీవి ఎన్ని సాహిత్యం సమకూర్చగా, హిందీలో తన్వీర్ ఘజ్వి రాశారు. యువర్స్ ఉన్ని ఈ ఆల్బమ్ కు ఎడిటర్.