24 ఏళ్ళు గడిచినా ఆ స్టార్ నటి మరణం మిస్టరీగానే మిగిలింది

24 ఏళ్ళు గడిచినా ఆ స్టార్ నటి మరణం మిస్టరీగానే మిగిలింది

Published on Sep 23, 2020 8:27 PM IST


నటీ నటుల ఆత్మహత్యల ఉదంతాలు ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్యలు ఈనాటివి కావు. డాబడాల క్రితం నుండీ సినీ తారల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి మిస్టరీ మరణమే స్టార్ నటి ‘సిల్క్ స్మిత’. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజున అనగా 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణం గురించి అనేకమంది అనేక కారణాలు, కథలు చెప్పినా ఇప్పటికీ ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పిన ఖచ్ఛితమైన కారణం, పరిస్థితులు తెలియలేదు.

ఇండియన్ మార్లిన్ మన్రోగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత తన 17 ఏళ్ల కెరీర్లో 450 సినిమాల వరకు చేశారు. అందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలున్నాయి. 80, 90 ల దశకంలో సినిమాకు తన స్క్రీన్ ప్రెజెన్స్, పాటల ద్వారా గ్లామర్ అప్పీల్ తెచ్చ్చిన నటి సిల్క్ స్మిత. ఆమె పాటల ద్వారానే గట్టెక్కిన సినిమాలున్నాయంటే, ఆమె చేసిన గ్లామర్ సాంగ్ ఒకటి ఉంటే చాలు సినిమా బాక్సులు హాట్ కేకుల్లా అమ్ముడైన సందర్భాలు ఉన్నాయంటే ఆమె స్టార్ డమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఏలూరులో పుట్టి చిన్న వయసులోనే వివాహం కాబడి అటు తర్వాత ఇంటి నుండి పారిపోయి సినిమా రంగంలో టచప్ ఆర్టిస్టుగా ప్రవేశించి ఆపై చిన్న చిన్న పాత్రలు
చేసి ఒకానొక దశలో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత జీవితం, సినీ ప్రయాణం ఎన్నో ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు, చీకటి వెలుగులు సమాహారం. వెండితెర మీద లెక్కకు మించి బోల్డ్ క్యారెక్టర్లలో కనిపించిన సిల్క్ స్మిత నిజజీవితంలో పెద్ద ఇంట్రోవర్ట్. ఎవ్వరినైనా సులభంగా నమ్మేసే అమాయకత్వం, సంపాదన పరులపాలు కాకుండా దాచుకోవాలనే లౌక్యం లేని తత్త్వం, అతి సున్నితమైన వ్యక్తిత్వం ఆమెను బయటకురాలేని కష్టాల్లోకి నెట్టేశాయని ఆమెను దగ్గరినుండి చూసినవారు చెప్పే మాటలు. ఎవరెన్ని చెప్పినా సంచనలం సృష్టించిన ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు