విడుదల తేదీ : నవంబర్ 24, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వీరాజ్, చలాకీ చంటి, శైలజ ప్రియ
దర్శకుడు : సంజయ్ షెరీ
నిర్మాతలు: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
సంగీతం: మోహిత్ రహ్మానియాక్
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
ఎడిటర్: అవినాష్ జి
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బిగ్ బాస్ విన్నర్ ప్రముఖ నటుడు విజే సన్నీ హీరోగా నటించిన చిత్రం “సౌండ్ పార్టీ” కూడా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..తండ్రీ కొడుకులు అయినటువంటి కుబేర్ కుమార్ (శివన్నారాయణ నరిపెద్ది) అలాగే డాలర్ కుమార్(వీజే సన్నీ) లు తమ వంశపారపర్యంగా ఎలాంటి కష్టం పడకుండా ఎప్పటికైనా బాగా డబ్బులు సంపాదించి మంచి ‘సౌండ్ పార్టీ’ అనిపించుకోవాలి అని కలలుగంటుంటారు. అలా చాలానే ట్రై చేస్తారు కానీ అన్నిట్లోని లాస్ట్ కి బూడిదే మిగుల్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే లోకల్ ఎమ్మెల్యే జోడెద్దుల వరప్రసాద్(30 ఇయర్స్ పృథ్వీ) తన కొడుకుని కాపాడుకోడానికి వారిని జైలుకి వెళ్లాలని వారికి కాదనలేని అమౌంట్ తో ఆఫర్ ఇస్తాడు. దీనితో ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేసిన వారి కథ ఎలా మలుపు తిరిగింది. జైలు నుంచి వారు బయటకి వస్తారా లేదా? తాము అనుకున్నట్టుగా సౌండ్ పార్టీ అయ్యారా లేదా అనేది వెండితెరపై చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మెయిన్ గా మెప్పించే మొదటి అంశం మంచి హిలేరియస్ గా నడిచే కథనం అని చెప్పాలి. ప్రతి పది పదిహేను నిమిషాలకి మంచి ఫన్ తో కూడుకున్న నరేషన్ సినిమాలో కనిపిస్తుంది. దీంతో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రియులు అయితే బాగానే నవ్వుకుంటారు. ఇక హీరో వీజే సన్నీ డీసెంట్ రోల్ ని చేసాడు. డాలర్ కుమార్ గా మంచి ఫన్ టైమింగ్ తో అలాగే తన లుక్స్ తో ఆకట్టుకుంటాడు.
అలాగే హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ క్యూట్ లుక్స్ తో డీసెంట్ నటనతో పర్వాలేదనిపిస్తుంది. అయితే సినిమాలో మరో మెయిన్ హైలైట్ మాత్రం నటుడు ‘అమృతం’ ఫేమ్ శివన్నారాయణ అని చెప్పాలి. తాను హీరో రోల్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్ ఫన్ తో నవ్విస్తారు. తనపై ఉన్న సీన్స్ అన్నీ మంచి ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అలాగే సప్తగిరి, చలాకీ చంటి తమ రోల్స్ లో మెప్పిస్తారు. ఇంకా పృథ్వీరాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఫన్ నరేషన్ ఉన్నప్పటికీ కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఈ కాన్సెప్ట్ లో చాలానే సినిమాలు చూసినట్టే అనిపిస్తుంది. దీనితో కామెడీ సినిమాల్లోనే కాస్త కొత్త స్టోరీ ఏమన్నా కోరుకునేవారికి అంతగా నచ్చదు. అలాగే సినిమాలో చాలా సీన్స్ లో లాజిక్స్ పెద్దగా లేవు. ఇంకా మరికొన్ని సన్నివేశాల్లో అయితే మరీ ఓవర్ గా ఉంటుంది.
ఇక నటుడు అలీ పాత్ర అయితే కంప్లీట్ గా వేస్ట్ అని చెప్పొచ్చు. అంత ముఖ్యమైన పాత్ర ఏమి తనకి ఈ చిత్రంలో లేదు అంత ఫన్ ని కూడా జెనరేట్ చేయదు. తన పోర్షన్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. ఇక తన పోర్షన్ లోనే జస్ట్ సైన్స్ ల్యాబ్ లో వాడే మైక్రో స్కోప్ ని అదేదో కరెన్సీ తయారు చేసే మిషన్ లా చూపించడం చాలా సిల్లీగా అనిపిస్తుంది.
ఇంకా హీరోయిన్ రోల్ కి కూడా మరీ అంత ఇంపార్టెన్స్ ఏమి సినిమాలో లేదు. చాలా వరకు సీన్స్ హిలేరియస్ గానే ఉంటాయి కానీ కొన్ని సీన్స్ మాత్రం ఇరికించినట్టుగా లాజిక్ లేని కామెడీగా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నీకాల్ టీం లో మ్యూజిక్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అలాగే డైలాగ్స్ కూడా మంచి ఫన్ తో బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు సంజయ్ షెరి విషయానికి వస్తే.. తాను రోటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన విధానానికి ఎక్కువ మార్కులు ఇవ్వవచ్చు. సినిమాని ఆల్ మోస్ట్ హిలేరియస్ గా చూపించే ప్రయత్నం తాను చేసాడు. కాకపోతే కొన్ని సిల్లీ లాజిక్స్ తో కొంతమేర స్క్రీన్ ప్లే విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. ఇవి పక్కన పెడితే కామెడీ పరంగా తాను ఇంకా బెటర్ కాస్టింగ్ తో మరిన్ని బెటర్ సినిమాలు చేయగలడు అనిపిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సౌండ్ పార్టీ” చిత్రంలో వీజే సన్నీ మరియు నటుడు శివన్నారాయణలపై నడిచే కామెడీ మంచి హైలైట్ అని చెప్పొచ్చు. కానీ అదే రొటీన్ లైన్ కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు. కామెడీ ఎలా ఉన్నా సరే చూడగలరు అనుకునేవారిని మాత్రం ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team