ప్రతియేటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది ఉగాది పురస్కారాల కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. ఈ నెల 30వ తేదీన చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడెమీలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఈ రోజు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చెన్నై మహానగరంలో తెలుగు వారి ఘన కీర్తిని చాటుతూ పాతిక సంవత్సరాలకు పైగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. ఈ ఏడాది ఈ నెల 30వ తేదీన సాయంత్రం 4.29 నిమిషాల నుంచి చెన్నై మ్యూజిక్ అకాడెమీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ ఏడాది హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్ ఇవ్వబోతున్నాం, అలాగే హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాపు రమణ పురస్కారం అందించనున్నాం. అలాగే ఉత్తమ సంచలన చిత్రంగా పుష్ప 2, ఉత్తమ చిత్రంగా హనుమాన్, ఉత్తమ నటులుగా ప్రభాస్, అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఇంద్రజ, నివేదా థామస్..ఇలా పలు విభాగాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న గొప్ప తెలుగు సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నాం. ఈ ఏడాది కూడా మా ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం’ అని అన్నారు.
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ.. ‘మన తెలుగు వారి కోసం శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను. ఈసారి ఉగాది పురస్కారాల కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సభా నిర్వహణ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. తెలుగులో సభా నిర్వహణ చేసినందుకు గతంలో స్వర్గీయ ఎస్పీ బాలు గారి ఆశీస్సులు పొందాను. తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం.’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణు, పర్వతనేని రాంబాబు, dr మీనాక్షి, కేశవ చారి, ముఖ్య అతిధులుగా YJ రాంబాబు, రఘు తదితరులు పాల్గొన్నారు.