హీల్ ఏ చైల్డ్ సంస్థకు ‘శ్రీమంతుడు’ టీమ్ విరాళం

హీల్ ఏ చైల్డ్ సంస్థకు ‘శ్రీమంతుడు’ టీమ్ విరాళం

Published on Nov 18, 2015 10:40 PM IST

Srimanthudu-donate
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా ఈ మధ్యే వందరోజులు కూడా పూర్తి చేసుకొని మహేష్ కెరీర్లో మరచిపోలేని సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలన్న కొరటాల శివ సందేశం కూడా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. శ్రీమంతుడు సినిమాలో చేసినట్లుగానే బయట కూడా ఊరిని దత్తత తీసుకొని మహేష్ రియల్ హీరో అనిపించుకున్నారు.

ఇక ఇదే పంథాను కొనసాగిస్తూ ‘శ్రీమంతుడు’ టీమ్ సామాజిక సేవలతో అందరి ప్రశంసలూ పొందుతోన్న ‘హీల్ ఏ చైల్డ్’ అనే సంస్థకు 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఈ ఉదయం దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీల్ ఏ చైల్డ్ సంస్థకు శ్రీమంతుడు టీమ్ 10 లక్షల రూపాయల చెక్ అందజేసింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. శ్రీమంతుడు పంచిన సందేశం అంతటా కొనసాగాలని, ఆ క్రమంలోనే ఇప్పుడీ ఆలోచన చేశామని తెలిపారు. ఇక ఇదే సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా శ్రీమంతుడు టీమ్ 5 లక్షల రూపాయల చెక్ అందజేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, మహేష్ భార్య నమ్రత శిరోధ్కర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు.

తాజా వార్తలు