ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప, పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర పాన్ ఇండియా ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఫలితంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాలో హీరో పాత్ర పేరు ‘పుష్ప’ అని ఎందుకు పెట్టారనే విషయంపై దర్శకుడు సుకుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తమిళనాట జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సుకుమార్, పుష్ప సినిమాలో హీరో పాత్ర ఓ రియల్ స్మగ్లర్ నుంచి స్పూర్తి పొంది డిజైన్ చేసినట్లు సుకుమార్ తెలిపారు. తాను ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకున్నప్పుడు పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్‌ను కలిశానని.. అతడి పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో అతిడిని ఇంటర్వ్యూ చేసినట్లుగా సుకుమార్ తెలిపారు. సాధారణంగా ‘పుష్ప’ అనే పేరును ఆడవారికి పెడతారని.. కానీ, ఓ స్మగ్లర్ ఇలాంటి పేరుతో ఉండటం తనను ఆకర్షించిందని సుకుమార్ తెలిపారు.
ఇలా పుష్ప అనే ఓ స్మగ్లర్ కారణంగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిందని ఆయన ఇప్పుడు రివీల్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక పుష్ప చిత్రానికి సంబంధించి మూడో పార్ట్ కూడా ఉంటుందని సుకుమార్ గతంలోనే వెల్లడించారు. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.