నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం చిత్రం ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. అంబ మూవీ పతాకంపై కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మధుసూదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాత. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, తుమ్మలపల్లి రామసత్య నారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు మాట్లాడుతూ, “గత నాలుగు రోజులుగా కృష్ణ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మధుసూదన్ గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ చూశాను. కృష్ణ గారు చాలా గ్లామర్ గా ఉన్నారు. ఎనర్జిటిక్ గా నటించారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కృష్ణ గారి అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నా” అని అన్నారు.
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణ మాట్లాడుతూ, “దర్శకుడు మధుసూదన్ నాకు మంచి మిత్రుడు. కన్నడలో ఆయన ఎన్నో మంచి చిత్రాలు డైరక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ట్రైలర్ చాలా ఫ్రెష్ గా, కలర్ ఫుల్ గా ఉంది. కృష్ణ గారు ఎంతో ఎనర్జిటిక్ గా నటించారు. ఇటీవల కృష్ణ గారి జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాళ్లు చిత్రం రీ రిలీజ్ చేశారు. హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ చిత్రం కూడా అదే విధంగా ఆడాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు మాట్లాడుతూ, “మే 31 అంటే కృష్ణ గారి అభిమానులకు పెద్ద పండగే. అంతటా ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారు లేకుండా జరగుతోన్న మొదటి పుట్టిన రోజు ఇది. ఆయన గురించి నేను దేవుడులాంటి మనిషి పుస్తకం రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఒక రోజు పిలిచి రీ ప్రింట్ చేయమన్నారు. వేసే లోపే దురదృష్టవ శాత్తూ ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కొన్ని మార్పులు చేర్పులతో ఆ పుస్తకాన్ని త్వరలో తీసుకొస్తున్నా. ఇక కృష్ణ గారు నటించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ, “కన్నడలో మధుసూదన్ గారికి దర్శకుడుగా మంచి పేరుంది. కృష్ణ గారితో చేసిన ఈ సినిమా ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ సినిమాకు కచ్చితంగా కృష్ణ గారి ఆశీస్సులు ఉంటాయి” అని అన్నారు.
దర్శకుడు హెచ్ మధుసూదన్ మాట్లాడుతూ, “వంశం డైరక్టర్ గా నా తొలి సినిమా. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఈ క్రమంలో శ్రీపాద్ హంచాటే గారు పిలిచి కృష్ణ గారితో సినిమా చేద్దామన్నారు. సంతోషంగా ఓకే చేశాను. 2007లో సినిమా పూర్తయింది. విడుదల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా రిలీజ్ కాలేదు. ఈ లోపు నేను కన్నడలో చాలా పిక్చర్స్ డైరక్ట్ చేశాను. కానీ కృష్ణ గారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలనీ, మా నిర్మాత దగ్గర నుంచి తీసుకొని సరికొత్త హంగులతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మార్చుకుని నేనే విడుదల చేస్తున్నా. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. కృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు.
యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో మెగాబ్రదర్ నాగబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం యం.యం శ్రీలేఖ, పీఆర్ఓ రమేష్ చందు, నిర్మాత శ్రీపాద్ హంచాటే, రచన, దర్శకత్వం హెచ్.మధుసూదన్ లుగా వ్యవహరిస్తున్నారు.