సమీక్ష : తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్ – అక్కడక్కడా ఆకట్టుకొనే తెనాలి తెలివితేటలు

Tenali Ramakrishna BA BL review

విడుదల తేదీ : నవంబర్ 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ, వరలక్ష్మీ శరత్ కుమార్,మురళి శర్మ, వెన్నెల కిషోర్,పోసాని, సప్తగిరి, ప్రభాస్ సత్యం, చమ్మక్ చంద్ర,రఘు బాబు, అన్నపూర్ణ,కిన్నెర తదితరులు

దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి

నిర్మాత‌లు : అగ్రహారం నాగి రెడ్డి, కె.సంజీవ రెడ్డి

సంగీతం : సాయి కార్తీక్

సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్

ఎడిటర్: : ఛోటా కె ప్రసాద్

 

కథ:

సరైన కేసులు రాక ఆదాయం లేక కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులను తన తెలివితేటలతో బయట సెటిల్మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు కర్నూల్ కి చెందిన తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్). ఈ క్రమంలో ఆ ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప శర్మ), స్థానికంగా ప్రజలలో మంచి పేరున్న వరలక్ష్మి దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని పోలీసుల సహాయంతో ఓ జర్నలిస్ట్ హత్య కేసులో దొంగ సాక్ష్యాలు పుట్టించి అరెస్ట్ చేయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తెనాలి రామకృష్ణ క్రిమినల్ లాయర్ చక్రవర్తి(మురళి శర్మను)ని ఓడించి నిర్దోషిగా ఆమెను కేసు నుండి భయటపడేలా చేస్తాడు.ఐతే ఈ కేసు విషయంలో తెనాలి రామకృష్ణకు ఊహించని విషయాలు తెలుస్తాయి. ఏమిటా విషయాలు? జర్నలిస్ట్ ని నిజంగా చంపింది ఎవరు? జర్నలిస్ట్ ని చంపిన వారిని చట్టానికి తెనాలి రామ కృష్ణ అప్పగించాడా లేదా అనేది? తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

 

విడుదలకు ముందే వంద శాతం నవ్వులు గ్యారంటీ అని చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి గట్టిగా చెప్పడం జరిగింది. చెప్పినట్లే మొదటి సగంలో కేసులు లేని కొత్త లాయర్ గా సందీప్ కిషన్ మరియు తోటి లాయర్ గా చేసిన ప్రభాస్ శ్రీను చక్కగా నవ్వించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే క్లయింట్ పాత్రలో సప్తగిరి తనదైన మేనరిజం, స్టయిల్ లో ప్రేక్షకులకు నవ్వులు పంచారు. ముఖ్యంగా ఫాస్ట్ బీట్ లో సాగే సాంగ్స్ లో సందీప్ మెస్మరైజింగ్ స్టెప్స్ తో దుమ్మురేపాడు. టైటిల్ సాంగ్ తో పాటు, మరో సాంగ్ లో ఆయన డాన్సులు అలరిస్తాయి.

ఏమి తెలియకున్నా అన్నీ తెలుసు అనుకొనే లాయర్ రుక్మిణి పాత్రలో హన్సిక క్యూట్ గా చేశారు. బేసిక్ సెక్షన్స్ పై కూడా అవగాహన లేకుండా ఏకంగా జడ్జీ అయిపోవాలనుకునే ఆమె ఇన్నోసెంట్ పెరఫార్మెన్స్ నచ్చుతుంది. మొదటి సగంలో సందీప్, హన్సికల రొమాంటిక్ ఎపిసోడ్ ఆహ్లాదంగా సాగింది.

బ్రేకుల్లేని స్కూటర్ తో సందీప్ హన్సిక పేరెంట్స్ మురళి శర్మ,రజిత ల మధ్య వచ్చే హాస్యపు సన్నివేశాలు కొంచెం పాతకాలపు వాసనలతో సాగినా నవ్వైతే తెప్పిస్తాయి. పోసాని జడ్జి పాత్రలో కనిపించిన కొద్దిసన్నివేశాలలో నవ్వించారు. మొదటి సగంలో దాదాపు చాలా వరకు హాస్యపు సన్నివేశాలు తెరపై పేలి నవ్వులు కురిపించాయి.

సందీప్ తండ్రి దుర్గా రావుగా అటు కామెడీ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ లో రఘుబాబు, కామెడీ తో పాటు కన్నింగ్ లాయర్ గా మురళి శర్మ మూవీకి ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తరువాత తెరపై కనిపించిన కిన్నెర, అన్నపూర్ణ తమ పాత్ర పరిధిలో చక్కగా చేశారు.

 

మైనస్ పాయింట్స్:

వెన్నెల కిషోర్,సప్తగిరి,పోసాని, ప్రభాస్ శ్రీను,రఘుబాబు,చమ్మక్ చంద్ర వంటి భారీ కమెడియన్స్ తో నాగేశ్వర రెడ్డి నాన్ స్టాప్ కామెడీ పండించాలని ప్రయత్నించారు కానీ, పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయారు. సందీప్ పాత్రకు తగ్గట్టుగా సాగే సన్నివేశాలతో పాటు, సప్తగిరి, ప్రభాస్ శ్రీను మరియు పోసాని, మురళి శర్మలు ఫస్ట్ హాఫ్ లో చక్కగా నవ్వించారు.

ఐతే డీసెంట్ గా మెప్పించే కామెడీ, ఆసక్తికర మలుపులతో ముగిసిన ఫస్ట్ హాఫ్ తరువాత మొదలైన సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశ పరిచింది.
డబ్బు కోసం పదవి కోసం ఎంతకైనా తెగించే కఠినాత్మురాలిగా వరలక్ష్మీ పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడు, ఆమె సమక్షంలో వెన్నెల కిషోర్ ఫ్యామిలీ మరియు సప్తగిరి చేత చేయించిన కామెడీ నవ్వుతెప్పించకపోగా విసుగు అనిపిస్తుంది.

తనదైన మేనరిజంతో నవ్వులు పంచే వెన్నెల కిషోర్ కామెడీ అసందర్భంగా ఉండటంతో అతని వలన ప్రయోజనం లేకుండా పోయింది. వరలక్ష్మీ తాను చేసిన ఓ మర్డర్ కేసులో కీలక సాక్షులకు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సిల్లీ శిక్షలు వేస్తుంది. దీనితో ఆమె పాత్ర బలహీనపడి ఆమె సీరియస్ విలన్ గా తెరపై ఆవిష్కృతం కాలేదు.

మర్డర్ కేసు విషయంలో సందీప్ తెలివిగా వరలక్ష్మిని బుక్ చేసిన సన్నివేశాలను హన్సికాతో చెప్పించి ఆ సన్నివేశాలకు ప్రాధాన్యం లేకుండా చేశారు.ఆ ట్విస్ట్ ని కోర్ట్ రూమ్ లో రివీల్ చేసి వరలక్ష్మి కి శిక్ష పడేలా క్లైమాక్స్ ముగించినా బాగుండేది. కేవలం ఒక చెట్టు కింద ప్లీడర్ ని ఎదుర్కోవడానికి వరలక్ష్మి తన శత్రువైన సింహాద్రి నాయుడు తో కలవడం నమ్మబుద్ది కాదు.

ఇక క్లైమాక్స్ మూవీ ప్రధాన బలహీనత. అసలు ఎటువంటి సంఘర్షణ లేకుండా, ఒక్క కోర్ట్ రూమ్ సన్నివేశం కూడా లేకుండా సందీప్ జస్ట్ ఒక వీడియోతో నిందుతులకు శిక్ష వేయించేస్తాడు. అసలు సినిమా ఐపోయిందా అనేంతలా ఈ మూవీలోని అన్ని పాత్రలకు సరైన ముగింపు కూడా ఇవ్వలేదు.

 

సాంకేతిక విభాగం:

ముఖ్యంగా తెనాలి రామ కృష్ణ సినిమాలో సాయి కార్తీక్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ తో పాటు సన్నివేశాలను ఎలివేట్ చేశేలా ఆయన బీజీఎమ్ సాగింది. సినిమాటోగ్రపీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్స్ లో విజువల్స్ ఆకర్షణీయంగా వచ్చాయి. ఇక ఎడిటింగ్ పర్వాలేదు.

కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరున్న జి నాగేశ్వర రెడ్డి ఓ కుర్ర లాయర్ కథతో కామెడీ పంచాలనుకున్న ఆయన ప్రయత్నం పూర్తిగా విజయం సాధించలేదు. ఫస్ట్ హాఫ్ లో సమకాలీన చిత్రాలలోని ఫేమస్ డైలాగ్స్, సీన్స్ పై ఆయన వేసిన సెటైర్స్, చేసిన స్పూఫ్స్ కొన్ని బాగానే నవ్వించాయి.

ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు సీరియస్ మర్డర్స్ మరియు విలన్ పాత్రల వైపు వెళ్ళకుంటేనే మంచిది. కామెడీ లాయర్ నుండి సీరియస్ హీరోగా సందీప్ పాత్రను మార్చిన నాగేశ్వర రెడ్డి, సీరియస్ విలన్ గా పరిచయమైన వరలక్ష్మీ పాత్రను సిల్లీ సన్నివేశాలతో ముగించారు. పాత్రలతో పాటు సినిమాకి ఆయన ఇచ్చిన ముగింపు సరిగా లేదు.

విలన్స్ తో సంబంధం లేకుండా సపరేట్ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ కొరకు రాసుకున్నా మూవీ మరోలా ఉండేది.

 

తీర్పు:

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ మూవీ పూర్తి స్థాయిలో హాస్యం పంచలేకపోయిందనే చెప్పాలి. మెప్పించే కామెడీ, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ మరియు సాంగ్స్ తో ఆహ్లదకరంగా సాగిన ఫస్ట్ హాఫ్ తరువాత మొదలైన సెకండ్ హాఫ్ నిరుత్సహాంగా సాగింది. సెకండ్ హాఫ్ లో అసందర్భంగా వచ్చే హాస్యపు సన్నివేశాలు నవ్వించకపోగా విసిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా దర్శకుడు మంచి కామెడీ ట్రాక్ రాసుకొని ఉంటే మూవీ మరోలా ఉండేది. చివరిగా తెనాలి రామ కృష్ణ తొలి సగం మాత్రమే నవ్విస్తాడు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version