విడుదల తేదీ : ఆగస్టు 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తదితరులు.
దర్శకుడు: పా. రంజిత్
నిర్మాత : కేఈ జ్ఞానవేల్ రాజా
సంగీత దర్శకుడు: జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్
ఎడిటర్ : సెల్వ ఆర్ కే
సంబంధిత లింక్స్: ట్రైలర్
‘చియాన్ విక్రమ్’ చేసిన తాజా ప్రయోగాత్మకమైన సినిమా ‘తంగలాన్ ‘. పా రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు)తో పాటు తన పిల్లలతో లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయితే, అప్పటి బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవాల్సి వస్తోంది. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం (‘కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ లో’) వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్ కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. ఐతే, ఆ బంగారు గనులకి కాపాలా కాస్తున్న ఆరతి (మాళవిక మోహనన్) నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురు అవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు ?, అసలు తంగలాన్ ఎవరు ?, అరణ్య (విక్రమ్) ఎవరు ? అతనికి ఆరతికి మధ్య సంబంధం ఏమిటి ?, చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం భారీ తారాగణంతో భారీ మరియు నిర్మాణ విలువలతో తెరకెక్కించబడటమే ఈ తంగలాన్ ప్రధాన బలం. విక్రమ్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుత పోరాటాల్లోనూ విక్రమ్ తన మార్క్ నటనతో హైలెట్ గా నిలిచారు. కీలక పాత్ర అయిన ఆరతి పాత్రలో నటించిన మాళవిక మోహనన్ చాలా చక్కగా నటించింది. ఆమెకు విక్రమ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి.
మొత్తానికి మాళవిక మోహనన్ కు గుర్తు పెట్టుకునే పాత్ర ఈ చిత్రంలో దక్కింది. భార్య గంగమ్మ పాత్రలో పార్వతీ తిరువోతు జీవించింది. అలాగే పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక ఇతర కీలక పాత్రలను పోషించిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం మొదటి భాగం బాగానే ఉంది. దర్శకుడు పా. రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. కథా నేపథ్యం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ తంగలాన్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్, కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. దీనికితోడు ఈ తంగలాన్ స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది.
సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, తంగలాన్ పాత్ర ఆరతి నుంచి ఎలా తప్పించకుంటుంది ? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది. మొత్తానికి దర్శకుడు పా. రంజిత్ టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్, కథ కథనం మీద పెట్టలేదు.
సాంకేతిక విభాగం :
మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు పా. రంజిత్, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘తంగలాన్’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా.. ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా విక్రమ్ నటన, కథా నేపథ్యం, యాక్షన్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, బోరింగ్ ప్లే, చాలా సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడిక్ ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చినా.. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చకపోవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team