విడుదల తేదీ : సెప్టెంబర్ 20, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: నందు, ప్రియా ఆనంద్, అశుతోష్ రాణా, అక్షర గౌడ, సోనియా అగర్వాల్, సుధ, రోషన్ కనకాల, తేజస్వి మదివాడ తదితరులు
దర్శకుడు: అనీష్ యోహన్ కురువిల్ల
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట
సంగీత దర్శకుడు: శక్తి కాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫీ: నవీన్ యాదవ్
ఎడిటర్స్: ఉమైర్ హసన్, ఫయిజ్ రాయ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ అనే కొత్త తెలుగు వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇందులో నందు, ప్రియా ఆనంద్, సోనియా అగర్వాల్, అశుతోష్ రాణా, అక్షర గౌడ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎంతమేర ఆకట్టుకుందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
విశ్వక్ సేన్(అశుతోష్ రాణా) అనే ఓ సైంటిస్ట్ తనకి చెందిన వారసత్వం, కంపెనీలని మోక్ష అనే ఐలాండ్‌లో భద్రపరిచి మరణిస్తాడు. దీంతో ఆయన టీమ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన వెంకట్(నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్), అదితి(సోనియా అగర్వాల్), మీనా(సుధ), ఇషా(తేజస్వి మదివాడ) తదితరులను ఆ ఐలాండ్‌కి పిలిపిస్తారు. అయితే, వీరికి ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ఐలాండ్‌పై వారం రోజులు ఎవరైతే గడుపుతారో వారికే తన ఆస్తిని ఇవ్వాలని విశ్వక్ తన వీలునామాలో రాస్తాడు. వచ్చినవారి బాగోగులను విశ్వక్ మరో భార్య మాయ(అక్షర గౌడ) చూస్తుంది. అయితే, రోజులు గడిచేకొద్ది వచ్చినవారిలో ఒక్కొక్కరు మాయం అవుతూ, హత్యకు గురవుతుంటారు. దీంతో ఆ ఐలాండ్‌లో ఏదో జరుగుతుందని వెంకట్ అండ్ టీమ్ భావిస్తారు. ఇంతకీ మోక్ష ఐలాండ్‌లో ఏం జరుగుతోంది..? ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి గురించి మరొకరికి ఎందుకు తెలియదు..? విశ్వక్ నిజంగానే చనిపోయాడా లేక ఇదంతా నాటకమా..? వచ్చినవారు ఎందుకు చనిపోతున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఈ వెబ్ సిరీస్‌ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మేకర్స్ ఓ ఆసక్తికరమైన కథను సెలెక్ట్ చేసుకుని, దాన్ని కొంతమేర బాగానే నెరేట్ చేశారు. మిస్టరీని చాలా పకడ్బందీగా మలిచారు. తొలి ఎపిసోడ్ చాలా త్వరగా టేకాఫ్ అయ్యి, ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళ్తుంది. తరువాత రెండు ఎపిసోడ్స్ కూడా ఎలాంటి ల్యాగ్, అనవసరమైన డ్రామా లేకుండా ఆకట్టుకుంటాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్‌లో నందు, ప్రియా ఆనంద్ తదితరులు వారి పాత్రల్లో ఎంటర్‌టైన్ చేశారు. ప్రియా ఆనంద్ పాత్రకు మంచి గుర్తింపు ఉంటుంది, ముఖ్యంగా కథలో వచ్చే ట్విస్ట్‌ని ఆమె హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. రోషన్ కనకాల తన నటనతో సర్‌ప్రైజ్ చేశాడు. నెగెటివ్ షేడ్స్ రోల్‌ను చాలా పర్ఫెక్ట్‌గా క్యారీ చేశాడు.
అశుతోష్ రాణా, అక్షర గౌడ కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. సపోర్టింగ్ క్యాస్ట్ తేజస్వి, సుధ, భానుచందర్ డీసెంట్ జాబ్ చేశారని చెప్పాలి.
ఈ సిరీస్‌కు మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. కథలోని సస్పెన్స్ సీన్స్‌కి మ్యూజిక్ ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
మిస్టరీ థ్రిల్లర్ అంటే కథ మొత్తం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి. ఎలాంటి సాగదీత లేకుండా కథపై ఆసక్తిని క్రియేట్ చేయాలి. కానీ, ఇందులో కథను సాగదీసిన విధానం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది.
మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే ఫ్యాన్స్ ఈ కథను ముందుగా ప్రెడిక్ట్ చేయగలరు. కానీ కామన్ ఆడియెన్స్‌కి ఈ కథ పర్వాలేదనిపిస్తుంది. కథలో మరికొన్ని ట్విస్టులు ఉండి ఉంటే బాగుండేది. అవి లేకపోవడంతో ఈ కథ ఆడియెన్స్‌ను ఆద్యంతం ఎంగేజింగ్ చేయలేకపోయింది.
ఒకట్రెండు స్లో ఎపిసోడ్స్, అనవసరమైన పాత్రలు, ఇంటిమేట్ సీన్స్, ఆకట్టుకోలేకపోయిన స్క్రీన్‌ప్లే వంటి అంశాలు ఈ వెబ్ సిరీస్‌పై చెడు ప్రభావం చూపెట్టాయి. కొన్ని పాత్రలను చక్కగా డిజైన్ చేయగా, మరికొన్ని చాలా ఫ్లాట్‌గా వెళ్తాయి. వీటికి తోడు సిరీస్‌లో పలు ప్రశ్నలకు సమాధానం లేకుండానే కథను సాగదీశారు. చివరి రెండు ఎపిసోడ్స్ వీక్ రైటింగ్ కారణంగా తేలిపోయాయి. బలమైన కథ రాసుకుని ఉంటే ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ను మరింత ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా మార్చేది.
సాంకేతిక విభాగం:
అనీష్ యోహన్ కురువిల్ల పనితనం పర్వాలేదనిపించింది. అయితే, చివరి నాలుగు ఎపిసోడ్స్‌ని ఇంకాస్త బెటర్‌గా హ్యాండిల్ చేసుంటే ఈ కథ అందరికీ నచ్చేది. రైటర్లు ప్రశాంత్ వర్మ, సంజయ్ రాయ్ ఇంకాస్త ఎంగేజింగ్ స్క్రిప్ట్‌పై ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్‌కు బలంగా నిలిచాయని చెప్పాలి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండటంతో ఈ వెబ్ సిరీస్ విజువల్‌గా ఆకట్టుకుంది.
తీర్పు:
మొత్తంగా ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ ప్రేక్షకులను కొంతమేర మెప్పిస్తుంది. నందు, ప్రియా ఆనంద్, అక్షర గౌడ, అశుతోష్ రాణా తమ నటనతో ఆకట్టుకున్నారు. కథలో సత్తా, ఆకట్టుకునే ట్విస్టులు, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే వంటివి ఉండి ఉంటే ఈ వెబ్ సిరీస్ రిజల్ట్ వేరేలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులకు ఈ సిరీస్ పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team