ఓటీటీ సమీక్ష: ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ – డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష: ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ – డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

Published on Feb 1, 2025 1:30 AM IST

The Secret of the Shiledars Web Series Review In Telugu

విడుదల తేదీ : జనవరి 31, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమ్హంకర్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ అమ్లాని, కన్నణ్ అరుణాచలం, దిలిప్ ప్రభావల్కర్ తదితరులు

దర్శకుడు : ఆదిత్య సర్పోట్దర్

నిర్మాతలు : నితిన్ వైద్య, రాహుల్ తడాని, జయిద్ బిన్ షాహెబ్ తదితరులు

సంగీతం : ట్రాయ్ – ఆరిఫ్

సినిమాటోగ్రఫీ : సుకేష్ విశ్వనాథ్

ఎడిటర్ : అనికేత్ కరన్డికర్, సాహిల్ విధాతె

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్’ హిందీ వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
జడ్జి శ్రీ కృష్ణకాంత్ దీక్షిత్(దిలీప్ ప్రభావల్కర్) ఛత్రపతి శివాజీకి సంబంధించిన రహస్య నిధి కోసం చాలా ఏళ్లుగా అన్వేషిస్తుంటాడు. అయితే, వృద్ధాప్యం దగ్గర పడటంతో ఈ నిధికి సంబంధించి డా.రవి భట్(రాజీవ్ ఖండేల్వాల్)తో ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటాడు. కానీ దాని గురించి చెప్పే లోపు అతడు హత్యకు గురవుతాడు. దీంతో రవి భట్ అనుమానితుడిగా మారుతాడు. పోలీసులు అతని కోసం వెతకడం.. గవర్నర్ రామ చంద్రన్(కన్నణ్ అరుణాచలం) నిధి వేటలో ఉండటంతో.. రవి అతడి సోదరుడు ఆదిత్య, జడ్జి అసిస్టెంట్ కలిసి నిధి కోసం సాహసయాత్ర చేస్తారు. తమ పూర్వీకులైన శిలేదార్స్ వదిలిన క్లూస్ ఆధారంగా పలు షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటారు. మరి ఈ నిధి అన్వేషణలో వారు విజయం సాధిస్తారా.. లేదా..? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్‌కు ప్రధాన బలం ఈ కథను నెరేట్ చేసిన విధానం అని చెప్పాలి. ఇలాంటి కథల గురించి ఆడియెన్స్‌కు ముందే అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈ కథను ప్రజెంట్ చేసిన విధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో మంచి నెరేషన్ ఉంటే, తర్వాత ఏం జరుగుతుందో ఊహించినా, ఆడియెన్స్‌ను కట్టిపడేయవచ్చు అనేది ప్రూవ్ అయ్యింది.

ఇక ఈ వెబ్ సిరీస్‌లో మరో ఆకట్టుకునే అంశం ఇందులోని నటీనటుల పర్ఫార్మెన్స్‌లు. రాజీవ్ ఖండేల్వా్ల్ ఇందులో సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సాయి తమ్హంకర్ తన పాత్రను చక్కగా పోషించారు. ఆశిష్ విద్యార్థి తన పాత్రలో ఆకట్టుకున్నాడు. హీరోతో అతని సీన్స్ బాగుంటాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేర మంచి నటన కనబరిచారు.

చరిత్రకు సంబంధించిన అంశాలను మోడ్రన్ కాలానికి తగ్గట్టు చూపెట్టిన విధానం బాగుంది. నేటితరం ఆడియెన్స్‌ను ఇది బాగా ఆకట్టుకుంటుంది. చారిత్రక ఘటనలు చక్కగా ప్రజెంట్ చేశారు.

మైనస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్ నెరేషన్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం మైనస్. మరికొన్ని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇందులో పెట్టి ఉంటే ఈ కథ మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది.

చారిత్రక సన్నివేశాలకు సంబంధించి కొన్ని సీన్స్‌ను ముందే ఊహించగలిగేలా చూపెట్టారు. వాటిలో ఏదైనా కొత్తదనం యాడ్ చేసి ఉంటే ఆయా సీన్స్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యేది.

ఇందులో నటించిన వారు బాగానే చేసినా వారి నుంచి ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయ్యింది. ఆడియన్స్ దీనికి కనెక్ట్ కాలేకపోతారు. మూడు, నాలుగో ఎపిసోడ్స్‌లో పేసింగ్ స్లో కావడంతో కథ ట్రాక్ తప్పిందా అనే సందేహం ఏర్పడుతుంది. స్క్రీన్‌పే మరింత గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే ఈ వెబ్ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారేది.

సాంకేతిక విభాగం:
ఈ వెబ్ సిరీస్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలమైన అసెట్‌గా నిలిచింది. కీలకమైన సన్నివేశాలు మొదలుకొని ఈ సిరీస్ ఆద్యంతం చక్కటి బీజీఎం వినిపిస్తుంది. సింపుల్ కథను ప్రజెంట్ చేసిన తీరులో దర్శకుడి పనితీరు బాగుంది. ఈ కథకు మరికొన్ని లోతైన అంశాలు యాడ్ చేసి ఉంటే ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేది. సినిమాటోగ్రఫీ వీక్షకులను ఆకట్టుకునేలా విధంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ఆకట్టుకుంటుంది.

తీర్పు:
మొత్తంగా ‘ది సీక్రెట్ ఆఫ్ శిలేదార్స్’ వెబ్ సిరీస్ హిస్టారికల్ మిస్టరీ థ్రిల్లర్ అయినప్పటికీ మోడ్రన్ స్టోరీ టెల్లింగ్‌తో డీసెంట్‌గా అనిపిస్తుంది. రాజీవ్ ఖండేల్వాల్, ఆశిష్ విధ్యార్థి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. చక్కటి నెరేషన్, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్‌ను చూసేలా చేస్తాయి. అయితే, కథను ముందే ఊహించడం, కొన్నిచోట్ల పేసింగ్ సమస్యలు వంటి అంశాలు నిరాశ పరుస్తాయి. మిస్టరీ థ్రిలర్స్ ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో ఈ వెబ్ సిరీస్ ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు