విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సక్సెస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ‘సామజవరగమన’ సినిమాతో రచయితగా గుర్తింపు తెచ్చుకొన్న నందుతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ త్రిష నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రిషకు ఈ సినిమా కథ చెప్పడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో త్రిష వెంకీతో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నమో వెంకటేశ’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి వీరిద్దరు కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.