‘టక్ జగదీష్’ను వెంటాడుతున్న పెను సమస్యలు

‘టక్ జగదీష్’ను వెంటాడుతున్న పెను సమస్యలు

Published on Apr 12, 2021 10:16 PM IST

నాని చేస్తున్న కొత్త సినిమాల్లో ‘టక్ జగదీష్’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి, మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం రీస్టార్ట్ అయిన ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదలచేయాలని అనుకున్నారు నిర్మాతలు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడ చేశారు. విడుదలకు ఇంకొక రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు సినిమా వాయిదాపడనుందని తెలుస్తోంది. ఈ వాయిదాకు పలు కారణాలున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతుండటంతో థియేటర్లు క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లోజ్ అవ్వకపోయినా 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధనను పెట్టొచ్చని అంటున్నారు. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. దీనికితోడు ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించేసింది. కొత్త జీవోతో గ్రామ, నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్ల టికెట్ ధరలు హైక్లాస్ రేటు సైతం రూ. 20 గా ఉంది. ఈ ధరలతో థియేటర్లకు నడపడం కష్టం అంటున్నారు యజమానులు. పైగా సినిమాను కొన్న బయ్యర్లు ఇంత తక్కువ ధరలకు టికెట్లు అమ్మితే లాభం సంగతి తర్వాత ముందు పెట్టుబడి కూడ వెనక్కి రాదని అందుకే సినిమా రిలీజ్ వాయిదావేయాలని నిర్ణయించుకున్నారట. ఒక్క నాని సినిమాకే కాదు త్వరలో రిలీజ్ పెట్టుకున్న పెద్ద సినిమాలన్నింటికీ ఇవే పెను సమస్యలుగా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు