సమీక్ష : టుక్ టుక్ – రొటీన్ గా సాగే సిల్లీ హారర్ ఎమోషనల్ డ్రామా !

Tuk Tuk Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : హర్ష రోషన్, కార్తికేయా దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, మరియు నిహాల్ కొధతి తదితరులు.
దర్శకుడు : సుప్రీత్ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి, సుప్రీత్ సి. కృష్ణ
సంగీతం : సంతూ ఓంకార్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ సాయి కుమార్
ఎడిటర్ : అశ్వత్ శివకుమార్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం’ టుక్ టుక్’. ఈ సినిమాలో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, మరియు నిహాల్ కొధతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

రాయలసీమలోని ఓ పల్లెటూరిలో ఈ కథ సాగుతుంది. ఓ ముగ్గురు టీనేజర్లు (హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. ఈ క్రమంలో వినాయక చవితికి చందాలు వసూలు చేసి, బొమ్మ పెట్టి హడావిడి చేస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ముగ్గురు కుర్రాళ్లు ఓ పాత స్కూటర్ ని బాగు చేసి, దేవుడ్ని ఊరేగిస్తారు. ఆ మూడు చక్రాల బైక్‌కి టుక్ టుక్ అని పేరు కూడా పెడతారు. ఐతే, ఆ బైక్ దానంతట అదే కదలడం, అదే నడవడం చేస్తూ ఉంటుంది. పైగా వీళ్ళు అడిగే ప్రశ్నలకు అవును, కాదు అని హ్యాండిల్ అటు ఇటు ఊపుతూ సమాధానాలు చెబుతూ ఉంటుంది. దీంతో ఆ బైక్ లో దేవుడు దూరాడు అనుకుంటారు. ఆ తర్వాత ఆ టుక్ టుక్ లో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది ?, ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది ?, మధ్యలో శిల్ప – నవీన్ లవ్ స్టోరీ ఏమిటి ?, చివరకు ఈ కుర్రాళ్లు శిల్ప కోసం ఏం చేశారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

లవ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని భావోద్వేగాలతో సాగిన ఈ టుక్ టుక్ లో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర లాంటి టుక్ టుక్ బైక్ ట్రాక్.. ఆ ట్రాక్ కి సంబంధించిన ఆత్మ కథ.. అలాగే ఆ టుక్ టుక్ బైక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. ముఖ్యంగా శిల్ప పాత్ర మరియు నవీన్ పాత్రతో ఆమె లవ్ ట్రాక్.. ఇలా మొత్తానికి టుక్ టుక్ సినిమా కొన్ని ప్రేమ సన్నివేశాల పరంగా పర్వాలేదు.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన నిహాల్ కొధతి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శాన్వీ మేఘన కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే, తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు తమ నటనతో మెప్పించారు. ఇతర పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘టుక్ టుక్’ స్క్రీన్ ప్లే బాగా స్లో గా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే, సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు టుక్ టుక్ బైక్ ట్రాక్ తాలూకు డ్రామా, అలాగే సినిమాలో మెయిన్ లవ్ స్టోరీ గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అసలు, ఈ జనరేషన్ లో ఇలాంటి మెలోడ్రామా ప్రేమ కథలను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారనేది డౌటే.

అయితే, దర్శకుడు సుప్రీత్ కృష్ణ పనితనం, నటీనటుల నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లో గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లో గా సాగుతూ బాగా విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ హారర్ లవ్ స్టోరీ లో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపించినా.. మిగతా కంటెంట్ చాలా బోరింగ్ ప్లేతో రోటీన్ గా సాగింది. మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సంతూ ఓంకార్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ కార్తీక్ సాయి కుమార్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు రాహుల్ రెడ్డి, లొక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి, మరియు సుప్రీత్ సి. కృష్ణ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘టుక్ టుక్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ డ్రామాలో.. కొన్ని బరువైన భావోద్వేగాలు, కొన్ని లవ్ సీన్స్ పర్వాలేదు. ఐతే, కథ కథనాలు బాగా స్లో గా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ప్రేమ సన్నివేశాలు కనెక్ట్ అయినా, సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version