‘బ్రహ్మోత్సవం’ నిరుత్సాహం తరువాత మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తూనే భవిష్యత్తులో మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. అందులో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి వంశీ పైడిపల్లి సినిమా. సరికొత్త కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా 2017 జూన్ లో మొదలయ్యాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి చివరి చిత్రం ‘ఊపిరి’ ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఇద్దరు బడా నిర్మాతలు కలిసి నిర్మించనున్నారు. వాళ్ళే అశ్విని దత్, దిల్ రాజు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, చిరుత’ వంటి భారీ సినిమాల్ని నిర్మించిన వైజయంతి మూవీస్, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, బొమ్మరిల్లు’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల్ని తీసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ భారీ లెవల్లో ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీ నటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


