సమీక్ష : “మార్కో” – వైలెంట్ గా సాగే రొటీన్ యాక్షన్ డ్రామా

Unni Mukundan Movie Review in Telugu

విడుదల తేదీ : జనవరి 01, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఉన్ని ముకుందన్, ఇషాన్ శౌలత్, అభిమన్యు ఎస్ తిలకన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్ మరియు ఇతరులు

దర్శకుడు : హనీఫ్ అదేని

నిర్మాత : షరీఫ్ మహమ్మద్

సంగీత : రవి బస్రూర్

సినిమాటోగ్రఫీ : చంద్రు సెల్వరాజ్

కూర్పు: షమీర్ మహమ్మద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ కొత్త ఏడాది ఆరంభంతో థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మళయాళ క్రేజీ హిట్ చిత్రం “మార్కో” కూడా ఒకటి. మంచి హైప్ ఇస్తూ తెలుగులో ఈ జనవరి 1 నుంచి రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుందో లేదో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. విక్టర్(ఇషాన్ షౌకత్) అనే కళ్ళు కనిపించని కుర్రాడిని రస్సెల్(అభిమన్యు ఎస్ థాలికన్) అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఇంకోపక్క ఇదే విక్టర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న మార్కో(ఉన్ని ముకుందన్) తన కుటుంబం కోసం ఎంత వరకు అయినా తెగించే వాడు విక్టర్ దారుణ మరణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అయితే ఈ విక్టర్ అనే కుర్రాడిని రస్సెల్ ఎందుకు చంపాల్సి వచ్చింది. రస్సెల్ అండ్ గ్యాంగ్ అలాగే మార్కో అన్నయ్య గ్యాంగ్ కి ఉన్న లింక్ ఏంటి? మార్కో తన పగని ఏ రేంజ్ వరకు తీసుకెళ్లి తీర్చుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మళయాళంలో సెన్సేషనల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. పైగా హిందీలో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రాన్ని చాలా మంది హిందీ వైలెంట్ చిత్రం “కిల్” తో కూడా చాలా మంది పోల్చారు. అయితే వారు అలా పోల్చడంలో తప్పు లేదని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అని కాదు కానీ ఈ సినిమాలో కూడా సాలిడ్ వైలెంట్ ఎలిమెంట్స్ భీభత్సంగా ఉన్నాయి.

ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే చాలా బ్రూటల్ గా అనిపిస్తాయి. కొన్ని సీక్వెన్స్ లు మంచి స్టైలిష్ గా కూడా డిజైన్ చేయడం అయితే యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ఫీస్ట్ ని అందిస్తాయి. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అలానే ప్రీ క్లైమాక్స్ విలన్ తో ఓ బ్రూటల్ ఎపిసోడ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ట్రీట్ ఇస్తాయి.

ఇక సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు అని చెప్పాలి. ఇది వరకు తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాల్లో చూసాం కానీ ఈ సినిమాలో మాత్రం తాను పూర్తిగా వేరే అని చెప్పాలి. తనలోని బీస్ట్ మోడ్ ని ఉన్ని ప్రదర్శించి యాక్షన్ మూవీ లవర్స్ కి ట్రీట్ ఇస్తాడు. తన పర్సనాలిటీ లుక్స్, పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడని చెప్పాలి.

ఇంకా తనతో పాటుగా విలన్ రోల్ లో కనిపించిన నటుడు అభిమన్యు థాలికన్ తన పాత్రలో క్రూరత్వాన్ని చూపించారు అలాగే మరో ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చి మరింత విలనిజాన్ని ప్రదర్శించి మంచి యాక్షన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకో సీనియర్ నటుడు సిద్దికీ కి కూడా మంచి రోల్ పడింది. ఇలా నటీనటులు అంతా తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా చేసేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాని ఒక క్రేజీ వైలెంట్ డ్రామాగా ప్రొజెక్ట్ చేశారు కానీ ఈ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లినవారికి ఒకింత నిరాశ తప్పదు. హీరో ఎంట్రీ సహా ఫస్టాఫ్ లో ఒకటీ రెండు సీన్స్ తప్ప మిగతా కథనం అంతా ఒకింత రొటీన్ గా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కిల్ తో కూడా చాలా మంది పోల్చారు కానీ దానికి దీనికి కేవలం ఎంత క్రూరత్వం చూపించారు అనే దానిలో చూసుకున్నా కూడా కిల్ ఒక మెట్టు పైన ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే మార్కోలో కూడా కిరాతకంగా చంపుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ వాటిలో అంత సహజత్వం అనిపించదు. చాలా వైలెన్స్ సీన్స్ లో ఆ నాచురాలిటీ మిస్ అయ్యింది కానీ కిల్ లో అలా ఉండదు. ప్రతీ సీన్ అంత కలర్ టోన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ డార్క్ థీమ్ లో సినిమాని చూపించినప్పటికీ అంత నాచురల్ గా కనిపించదు.

ఇంకా చెప్పాలంటే మార్కో లో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఏదో వీడియో గేమ్స్ లో గ్రాఫిక్స్ ని తలపిస్తాయి. సో నాచురాలిటీతో కూడిన ఒక క్రేజీ యాక్షన్ అండ్ వైలెన్స్ సినిమాని కోరుకునేవారికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. ఇక ఇవి కాకుండా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సడెన్ గా బలహీనం అయ్యిపోయిన హీరో పాత్ర మళ్ళీ వేంటనే బలపడిపోవడం ఆ పరిస్థితులు అంత సింక్ అయ్యినట్టుగా కనిపించవు. ఇలా కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా లేకపోలేవు. ఇంకా ఇది ఏ రేటెడ్ సినిమానే అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ లో ఓ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని డిస్టబ్ చెయ్యొచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా మేకర్స్ మంచి ఖర్చు చేసారని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లో రవి బాసృర్ స్కోర్ కొన్ని సీన్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. మంచి స్టైలిష్ బీట్స్ ని తాను అందించారు కాకపోతే ఇంకా పలు సీన్స్ లో బాగా ఇచ్చుంటే బాగుండేది. చంద్రు సినిమాటోగ్రఫీ బాగుంది. షమీర్ ముహమ్మద్ స్కోర్ ఎడిటింగ్ ఓకే. యాక్షన్ పార్ట్ డిజైన్ బాగుంది కానీ వాటిలో సహజత్వం లోపించింది.

ఇక దర్శకుడు హనీఫ్ అదేని విషయానికి వస్తే.. తాను రొటీన్ రివెంజ్ ప్లాట్ నే ఎంచుకున్నారు కానీ దానికి ఒక భయంకరమైన రక్తపాతాన్ని జోడించారు. హింసలో పీక్ ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు తాను చూపించారు. కానీ కథనం మాత్రం సోసోగానే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ పార్ట్, వైలెన్స్ పార్ట్ వరకు మాత్రం తన వర్క్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మార్కో” బ్రూటల్ గా సాగే రొటీన్ రివెంజ్ తో కూడిన వైలెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ ప్రాణం పెట్టేస్తే.. మంచి యాక్షన్, ఇలాంటి బ్లడ్ యాక్షన్ డ్రామాలని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం నచ్చవచ్చు. కానీ కథ, కథనాల్లో కూడా దర్శకుడు ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసినట్టు అయితే ఈ బ్లడ్ అండ్ యాక్షన్ డ్రామా ఇంకా గట్టిగా పేలేది. సో వీటితో డెఫినెట్ గా ఓసారికి ఈ చిత్రాన్ని యాక్షన్ లవర్స్ ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version