సమీక్ష : ఉస్తాద్‌ – స్లోగా సాగే డల్ డ్రామా !

Ustaad Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవి శివ తేజ, సాయి కిరణ్ ఏడిద తదితరులు

దర్శకుడు : ఫణిదీప్

నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు

సంగీతం: అకీవ బీ

సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల

ఎడిటర్: కార్తీక్ కట్స్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

శ్రీ సింహా హీరోగా కావ్య కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం `ఉస్తాద్‌. ఈ చిత్రానికి ఫణిదీప్‌ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథః

 

సూర్య(శ్రీ సింహా)కి అతని చిన్నతనం నుంచే ఎత్తైన ప్రదేశాలంటే భయం. పెద్దయ్యాక కూడా అతనిలో ఆ ప్రభావం ఉంటుంది. ఐతే, సూర్య డిగ్రీలో ఉన్నప్పుడు ఉస్తాద్ అనే బైక్ మీద అతనికి ఇష్టం ఏర్పడుతుంది. ఆ బైకే ప్రపంచంగా బతుకుతాడు. ఆ బైక్ ద్వారానే మేఘన (కావ్య కళ్యాణ్ రామ్) పై ప్రేమ కలుగుతుంది. ఆ బైక్ ద్వారానే సూర్య పైలెట్ కావాలనే గోల్‌ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఫైలట్‌గా మొదటిసారి ఫ్లైట్‌ ని సూర్య ఎలా హ్యాండిల్‌ చేశాడు ?, తన కెప్టెన్‌( గౌతమ్ వాసుదేవ్‌) సారథ్యంలో సూర్య ఫ్లైట్‌ ను ఎలా ల్యాండింగ్‌ చేశాడు ?, ఇంతకీ మేఘన (కావ్య కళ్యాణ్‌ రామ్‌)తో సూర్య లవ్‌ స్టోరీ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మనుషుల మీదే కాదు, వస్తువుల మీద కూడా ఎమోషన్ ఉంటుంది, అవి కూడా మనుషులకు చాలా అనుభవాలు, జ్ఞాపకాలు ఇస్తాయి అనే కోణంలో సాగిన ఈ ఉస్తాద్ లో కొన్ని ఎమోషన్స్, మరియు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. సూర్య అనే కుర్రాడి ఉస్తాద్ అనే బైక్ వల్ల వచ్చిన సంతోషం, బాధ, ముఖ్యంగా ఓ లక్ష్యం.. ఆ లక్ష్యం తాలూకు ప్రయాణం.. ఇలా ఎమోషనల్ డ్రైవ్ కొంతవరకు బాగానే ఉంది. శ్రీ సింహా కోడూరి గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయికగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, హీరోయిన్ ఫాదర్ కు హీరోకు మద్య సాగే సీన్స్ బాగానే ఉన్నాయి. హీరోకి తల్లి పాత్రలో నటించిన అను హాసన్ తన నటనతో ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె చాలా బాగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ ‘ఉస్తాద్’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో శ్రీ సింహా కోడూరి క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. దర్శకుడు ఫణిదీప్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, దీనికితోడు రిపీటెడ్ సీన్స్ ఎక్కువవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

మొత్తమ్మీద దర్శకుడు ఫణిదీప్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొదటి భాగంలో కొన్ని చోట్ల సరదాగా సాగినా, రెండవ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని లవ్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగతా పార్ట్ అంతా ప్రేక్షకులు ఓపిక తెచ్చుకుని చూడాలి. ఓవరాల్ గా సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు అకీవ బీ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ పవన్ కుమార్ పప్పుల వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఈ చిత్ర నిర్మాతలు రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

దర్శకుడు ఫణిదీప్ ఈ ‘ఉస్తాద్’ స్క్రిప్ట్ ను ఇంకా పగడ్బందీగా రాసుకొని ఉండి ఉంటే…ఈ చిత్రం ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ జర్నీ అయ్యి ఉండేది. కానీ, స్క్రిప్ట్ లో లోపాలు కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version