మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమన్నది మిరాకిల్ అన్నట్లుగా పరిస్ధితులు తయారయ్యాయి. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగు భామలను దర్శక నిర్మాతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. కానీ కొందరు తెలుగు అమ్మాయిలు మాత్రం ఇలాంటి వాటికి అతీతమని నిరూపిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ప్రూవ్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో యంగ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య ఒకరు.
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్యకు ఆన్లైన్ యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, అరెరె మానస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్ వైష్ణవి చైతన్యకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని చిన్న పాత్రయినా సరే ఒప్పుకుని తన ముద్ర వేసుకుంది.
ఇక ఈ దశలో సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ చిత్రం వైష్ణవి కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్ల వరకు వసూళ్లను సాధించి చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. బేబీ విజయంలో వైష్ణవిదే కీలకపాత్ర.. అందుకే ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. నాటి నుంచి వైష్ణవికి అవకాశాలు క్యూకట్టాయి. అలా అని ఆమె వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేయడం లేదు.
సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.కథాబలం, కథను ముందుకు నడిపించే పాత్రలనే ఆమె ఎంపిక చేరుకుంటుంది. ప్రస్తుతం ఆమె ‘జాక్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె ముస్లిం అమ్మాయిగా కనిపించబోతుంది అని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది.’బేబి’ తో వైష్ణవి, ‘టిల్లు స్క్వేర్’ తో సిద్ధు రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ ఫామ్లో ఉన్నారు. అందువల్ల ‘జాక్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఒక్క తెలుగుతో పాటు తమిళం, కన్నడ ఇండస్ట్రీలు కూడా ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తమిళ, కన్నడ సినిమాలకు వైష్ణవి సైన్ చేశారట. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా లంగా ఓణీలో పదహారణాల తెలుగు అమ్మాయిలా వైష్ణవి చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాలో వైరల్ అవుతుంది.