సైబర్ మోసాలు పాల్పడే వారి నుండి జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయినా కూడా కొంతమంది వారి వలలో ఇరుక్కుని మోసపోతున్న ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ కూడా ఈ సైబర్ మోసగాళ్లకు టార్గెట్ గా మారింది. అయితే, ఆమె చాకచక్యంగా తృటిలో వారి నుంచి తప్పించుకుంది.
తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ అనన్య నాగళ్ల, తాజాగా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంది. ఆమెకు ఇటీవల ఓ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి ఫోన్ రావడంతో, తన ఐడీతో ఉన్న ఓ సిమ్ కార్డుతో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని వారు తెలిపారట. దీంతో అనన్య సిమ్ ను బ్లాక్ చేస్తున్నట్లుగా వారు హెచ్చరించారట. ఇలా జరగకూడదంటే, ఆమె పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలని వారు సూచించారట.
దీంతో ఆమె కాల్ ను పోలీసులకు కనెక్ట్ చేస్తున్నట్లుగా చెప్పి, ముంబై పోలీసులమంటూ ఫోన్ కనెక్ట్ చేశారు. పోలీస్ క్లియరెన్స్ కోసం ముంబై రావాలని వారు తెలిపారు. వీడియో కాల్ లో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటూ, ఆమె ఆధార్ నెంబర్ తీసుకున్నారు. ఆమె పేరుపై 25 అకౌంట్లు ఉన్నాయని.. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ వ్యక్తికి డబ్బు పంపాలని.. అటుపై ఆర్బీఐ చూసుకుంటుందని తెలిపాడట. దీంతో అనుమానం వచ్చిన అనన్య, గూగుల్ సెర్చ్ చేయగా అది ఫ్రాడ్ అని గుర్తించింది. దీంతో ఆమె ఎదురుతిరిగి మాట్లాడి, పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్లుగా చెప్పడంతో అవతలి వ్యక్తి కాల్ కట్ చేశాడట. దీనికి సంబంధించిన తన చేదు అనుభవాన్ని ఓ వీడియో రూపంలో అనన్య షేర్ చేసుకుంది. ఇక వకీల్ సాబ్ వంటి సినిమాలోనూ నటించిన అనన్యకు ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో ఆమె అభిమానులు ఖంగుతింటున్నారు.