విడుదల తేదీ : ఆగస్టు 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: జాన్ అబ్రహం, శర్వరి, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా, ఆశిష్ విద్యార్థి, కుముద్ మిశ్రా, రాజేంద్ర చావ్లా మరియు ఇతరులు.
దర్శకుడు: నిఖిల్ అద్వానీ
నిర్మాతలు : ఉమేష్ కె ఆర్ బన్సల్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, జాన్ అబ్రహం
సంగీత దర్శకుడు: అమల్ మల్లిక్, మనన్, భరద్వాజ్, యువరాఘవ్–అర్జున్, కార్తీక్ షా
సినిమాటోగ్రఫీ: మలయ్ ప్రకాష్
ఎడిటర్ : మహిర్ జవేరి
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన లేటెస్ట్ చిత్రం “వేదా” పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చింది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఇక కథలోకి వస్తే.. భారత్ ఆర్మీకి చెందిన మేజర్ అభిమన్యు కన్వర్(జాన్ అబ్రహం) తన పర్శనల్ రివెంజ్ కారణంగా ఆర్మీ నుంచి తొలగించబడతాడు. దీనితో తన భార్య రాశి (తమన్నా భాటియా) సొంత ఊరు రాజస్థాన్ లోని బార్మర్ లోకి అడుగు పెడతాడు. అయితే ఆ ఊరు సహా చుట్టు పక్కల 100 గ్రామాలని తన అదుపులో పెట్టుకునే సర్పంచ్ జితేందర్ ప్రతాప్ సింగ్ (అభిషేక్ బెనర్జీ) తన కుటుంబం అక్కడ తక్కువ కులాల వారిని హీనంగా చూస్తూ దారుణంగా ట్రీట్ చేస్తుంటారు. ఈ క్రమంలో అభిమన్యు ఆ ఊరి స్కూల్ బాక్సింగ్ కోచ్ గా జాయిన్ అవుతాడు. ఇక్కడ బాక్సింగ్ నేర్చుకోవాలని తపించే తక్కువ కులం అమ్మాయి వేదా బేర్వా (శర్వరి) కి ఎలా అండగా నిలబడ్డాడు? ఆమెకి తన కుటుంబానికి జితేందర్, తన తమ్ముడు వల్ల ఎలాంటి దారుణాలు ఎదుర్కొన్నారు? ఈ కుల వివక్ష విషయంలో వేదా చట్టపరంగా గెలుస్తుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో జాన్ అబ్రహం తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అని చెప్పాలి. మామూలుగానే జాన్ తన డైనమిక్ పర్శనాలిటీతో మంచి యాక్షన్ తో అదరగొడతాడు. అలా తనపై ఈ సినిమాలో కొన్ని మాస్ సీన్స్ ఫస్టాఫ్ లో ఎలివేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. అలాగే నటి శర్వరి తన రోల్ లో ఇంప్రెస్ చేస్తుంది. మంచి లుక్స్ సహా నాచురల్ పెర్ఫామెన్స్ ని ఆమె తన రోల్ లో అందించింది.
అలాగే సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది కాబట్టి మెయిన్ పాయింట్ మనకి ఎమోషనల్ గా అనిపించవచ్చు. ఒక అణగారిన కులానికి చెందిన అమ్మాయి కోసం పోరాటం చేసిన సోల్జర్ కథని మేకర్స్ తీసుకున్నారు ఎమోషనల్ గా ఈ పాయింట్ బాగుంది. అలాగే ఫస్టాఫ్ సినిమాలో మెప్పిస్తుంది.
అలాగే కులాలు సంబంధించి కొన్ని సీన్స్ ఇంకా ఈరోజుల్లో ఇలాంటి జనం మన దేశంలోనే ఉన్నారా అనే కొన్ని సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఇక వీటితో పాటుగా పాతాళ లోక్ ఫేమ్ నటుడు అభిషేక్ బెనర్జీ సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే నెగిటివ్ రోల్స్ లో కనిపించిన ఇతర నటులు ఆశిష్ విద్యార్థి అలాగే ఇతర నటీనటులు ఇంప్రెస్ చేస్తారు.
మైనస్ పాయింట్స్:
మామూలుగా కొన్ని నిజ జీవిత సినిమాలు తెరకెక్కించినపుడు అందులో సోల్ ని దెబ్బ తీయకుండా తీస్తే అది ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది. కానీ అనవసర బిల్డప్ లకి వెళితే దాని ఫలితం వేదా లా మారుతుంది చెప్పాలి. సినిమాలో మేకర్స్ మంచి లైన్ ని తీసుకుని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దానిని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా చూపించలేకపోయారు అని చెప్పాలి.
ఫస్టాఫ్ వరకు కథనం ఓకే కానీ సెకండాఫ్ మాత్రం కథనమే పరమ బోరింగ్ గా సాగుతుంది. జాన్ అబ్రహాంపై అనవసర బిల్డప్ సీన్స్ ఓవర్ గా చూపించే యాక్షన్ బాగా చిరాకు తెప్పిస్తాయి. అసలు ఇంత బిల్డప్ లాంటివి అవసరం లేదు అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో యాక్షన్ సీన్స్ టేకింగ్ కూడా బాగాలేదు. చాలా ఫోర్స్డ్ గా లాజిక్ లేకుండా అవి కనిపిస్తాయి.
ఇంకా తమన్నా రోల్ కి సినిమాలో పెద్దగా స్కోప్ ఏమి లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా తమన్నా తండ్రి అలాగే వేదా మావయ్య ఇద్దరూ ఒకేలా అనిపిస్తారు.. ఒకే నటుణ్ని రెండు పాత్రలకి తీసుకున్నారా అన్నట్టు కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. అలాగే కథనం చాలా రొటీన్ గా సాగుతుంది. దాదాపు అన్ని సీన్స్ కూడా చాలా ఊహాజనితంగా సాగుతుంది. దీనితో మంచి సోల్ ఉన్న సినిమా డిజప్పాయింటింగ్ గా సాగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం కొన్ని సీన్స్ లో బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. 2007 సమయంలో కనిపించే సన్నివేశాలు అన్నట్టుగా చూపించిన నాచురల్ విజువల్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. తెలుగులో డబ్బింగ్ బాగుంది.
ఇక దర్శకుడు నిఖిల్ అద్వానీ విషయానికి వస్తే.. తాను ఈ సినిమా విషయంలో మంచి నేపథ్యాన్ని తీసుకున్నారు. అలాగే ఫస్టాఫ్ వరకు దానిని బాగానే తీసుకెళ్లారు కానీ సెకండాఫ్ ని మాత్రం పూర్తిగా నీరుగార్చారు అని చెప్పాలి. చాలా డల్ మూమెంట్స్ తో వీక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని నడిపించడం బాగా డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన ఎమోషన్స్ ని ఫ్లోని సెకండాఫ్ లో కూడా కంటిన్యూ చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “వేదా” లో మేకర్స్ మంచి నేపథ్యాన్ని ఎంచుకున్నారు కానీ ఇది ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే రకంగా అయితే సాగలేదు అని చెప్పాలి. జాన్ అబ్రహం అలాగే శర్వరి తమ రోల్స్ కి సిన్సియర్ గా చేశారు కానీ దర్శకుడు తెరకెక్కించిన విధానం మాత్రం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. నిజ జీవితంలో జరిగిన విషాద గాథ ఇది అయినప్పటికీ బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఆ కథకి మంచి ట్రిబ్యూట్ అయ్యి ఉండేది. కానీ అనవసరపు ఎలివేషన్లు, డ్రామా పెట్టి సినిమాని దర్శకుడు బలహీన పరిచాడు. దీనితో వేదా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team