ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అంశం యూట్యూబర్స్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు పాకింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు పలువురు టాలీవుడ్ స్టార్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
విజయ్ దేవరకొండ ఓ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నైపుణ్యాన్ని పెంచుకునే గేమ్స్‌ని మాత్రమే ఆయన ప్రమోట్ చేశారని.. ఇది అన్ని విధాలుగా చట్టానికి లోబడి ఉందని.. కేవలం కొన్ని ప్రాంతాల వరకే ఇది పరిమితంగా ఉందని విజయ్ దేవరకొండ టీమ్ పేర్కొంది. ఆయన ఏదైనా అగ్రిమెంట్ చేసే ముందు ఆయన లీగల్ టీమ్ పూర్తి పరిశీలన తర్వాతే, విజయ్ ఆ అగ్రీమెంట్ ఓకే చేస్తారని.. ఇప్పటివరకు ఆయన ప్రమోట్ చేసిన గేమ్స్ కేవలం స్కిల్ బేస్ట్ గేమ్స్ మాత్రమే అని విజయ్ తరఫు టీమ్ ప్రకటించింది.
అయితే, ఈ ఒప్పందం 2023లో ముగిసిందని.. ప్రస్తుతం ఆయన ఎలాంటి ఆన్‌లైన్ గేమ్స్ ప్రమోట్ చేయడం లేదని.. ఆయనకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రేక్షకులు, అభిమానుల్లోకి వెళ్లకూడదని తమ టీమ్ ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిన ఆన్‌లైన్ గేమ్స్ ఎలాంటి చట్టవ్యతిరేకమైనవి కావని వారు క్లారిటీ ఇచ్చారు.