ఇంటర్వ్యూ : డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి – ‘వికటకవి’ సిరీస్ ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది

ఇంటర్వ్యూ : డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి – ‘వికటకవి’ సిరీస్ ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది

Published on Nov 14, 2024 9:01 AM IST

డిఫ‌రెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌, సినిమాల‌తో ప్రేక్షకుల‌ను మెప్పిస్తోన్న ఓటీటీ ZEE5. ఈ మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

‘వికటకవి’ ప్రయాణం ఎలా మొద‌లైంది?
ప్రశాంత్ వ‌ర్మగారితో అ!, క‌ల్కి సినిమాల‌కు వ‌ర్క్ చేసిన రైట‌ర్ తేజ దేశ్‌రాజ్‌ రాసుకున్న క‌థ‌. త‌ను నాకు మంచి స్నేహితుడు. జీ5 వారికి క‌థ‌ను వినిపించి సిరీస్‌ను చేయ‌టానికి ఒప్పించి అన్నీ సిద్ధం చేసుకున్నారాయ‌న‌. సిరీస్‌ను రూపొందించ‌టానికి జీ5 టీమ్ హీరోలను, ద‌ర్శకుల‌ను కొంత‌మందితో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. ఆ స‌మ‌యంలో తేజ, నేను ఓసారి క‌లుసుకున్నప్పుడు విక‌ట‌క‌వి సిరీస్ గురించి చెప్పి.. నువ్వు డైరెక్ట్ చేస్తావా! అని అడిగారు. నేను క‌థ విన్నాను. నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరి, జీ5 టీమ్ ఓ బ‌డ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగ‌ల‌వా? అన్నారు. నేను అంగీక‌రించాను. అక్కడి నుంచి విక‌ట‌క‌వితో నా ప్రయాణం ప్రారంభ‌మైంది.

పీరియాడిక్ జోన‌ర్‌లో సిరీస్‌ను చేయ‌టం ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది?
విక‌ట‌క‌వి త‌ర‌హా పీరియాడిక్ సిరీస్ చేయ‌టం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నాతో పాటు నా టీమ్‌కి కూడా వ‌ర్క్ ప‌రంగా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ ఇది. ఎందుకంటే క‌థ‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. క‌థంతా 1940, 1970 కాలాల్లో జ‌రుగుతుంది. 1940, 1970 కాలాల‌కు సంబంధించిన సెట‌ప్స్‌, బ‌ట్టలు, అప్పటి ప్రజ‌లు మాట్లాడే భాష‌, లుక్స్‌, లైటింగ్, వ‌ర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది.

మేకింగ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి?
విక‌ట‌క‌వి సిరీస్‌కు షోయ‌బ్ అనే సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్క్ చేశారు. త‌న‌ని ఈ ప్రాజెక్ట్‌కి తీసుకొద్దామ‌ని అనుక‌న్నప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. ఇక్కడ ఇంత మంది ఉండ‌గా పంజాబీ కెమెరామెన్‌ను ఎందుకు తీసుకోవటం అని అన్నవాళ్లు లేక‌పోలేదు. అయితే విక‌ట‌క‌విలో డ్రామా వేరుగా ఉంది. అందుక‌నే కొత్త సినిమాటోగ్రాఫ‌ర్ అయితే బావుంటుంద‌నిపించి షోయ‌బ్‌ను తీసుకున్నాను. సంజీవ్ అనే టెక్నీషియ‌న్ మా డీఓపీ షోయ‌బ్‌కు స్నేహితుడు కావ‌టం క‌లిసొచ్చింది. త‌ను మా ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. కాస్ట్యూమ్స్ చేసిన గాయ‌త్రి, ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ కిర‌ణ్‌.. ఇలా మంచి మంచి టెక్నీషియ‌న్స్ అంద‌రూ సిరీస్‌లో పార్ట్ అయ్యారు.

అమ‌రగిరి సంస్థానం అనే కాన్సెప్ట్‌ను క‌థ‌లో ఎంచుకోవ‌టానికి కార‌ణమేంటి?
స్వాతంత్య్రం రాక మునుపు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి ప్రాంతం ఒక‌టి. రైట‌ర్ తేజ డిఫ‌రెంట్ క‌థ‌ను చెప్పాల‌నుకున్నప్పుడు త‌న మైండ్‌లో వ‌చ్చిన ఐడియా ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్లలో ఊరు మునిగి పోతుంది. అనే బ్యాక్ డ్రాప్ క‌థ‌తో విక‌ట‌క‌వి అనే ఫిక్షన‌ల్ పాయింట్‌ను తీసుకున్నారు.

ఫిక్షనల్ డిటెక్టివ్ సిరీస్‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారు?
క‌థ‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను పెట్టింది రైట‌ర్ తేజ‌. నిజానికి మ‌న తెలుగు సినిమాల్లో విక‌ట‌క‌వి అంటే రాయ‌ల సంస్థానంలో ప‌ని చేసిన తెనాలి రామ‌కృష్ణుడు హాస్య చ‌తుర‌త క‌లిగిన క‌వి అనే ఫీలింగ్ ఉంది. మ‌న‌ది ఫిక్షన‌ల్ డిటెక్టివ్ సిరీస్ క‌దా, ఎందుకు విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టార‌ని నేను అడిగాను. దానికి ఆయ‌న తెనాలి రామ‌కృష్ణుడు శ్రీకృష్ణదేవ‌రాయ‌లుగారి ద‌గ్గర గూఢ‌చారిగా ప‌ని చేశారు. మ‌న క‌థ‌లో హీరోకు అలాంటి షేడ్స్ ఉండ‌టంతో విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టాన‌ని తేజ చెప్పారు.

న‌రేష్ అగ‌స్త్యను హీరోగా ఎంచుకోవ‌టానికి రీజ‌నేంటి?
నేను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు మేక‌ర్స్ కొంత మంది హీరోల‌ను అప్రోచ్ అయ్యారు. కానీ వ‌ర్కవుట్ కాలేదు. నేను బోర్డ్ పైకి వ‌చ్చిన త‌ర్వాత న‌రేష్ అగ‌స్త్య పేరుని సూచించాను. అందుకు కార‌ణం.. ఆయ‌న రాజేంద్రప్రసాద్‌గారితో న‌టించిన సేనాప‌తి, మ‌త్తువ‌ద‌ల‌రా చూశాను. త‌న యాక్టింగ్ న‌న్నెంతో ఆక‌ట్టుకుంది. దాంతో నేను న‌రేష్ పేరుని స‌జెస్ట్ చేశాను. ఆ స‌మ‌యంలో జీ5 వాళ్లు న‌రేష్‌తో ప‌రువు సిరీస్‌ను చేస్తున్నారు. నాకు త‌న‌ను క‌ల‌వ‌టం చాలా సుల‌భ‌మైంది. న‌రేష్ రెట్రో లుక్‌లో అలా పాత్రలో ఒదిగిపోయాడు.

మేఘా ఆకాష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?
సీనియ‌ర్ యాక్టర్ సిజు మీన‌న్ అమ‌రగిరి ప్రాంతానికి వ‌య‌సుమ‌ళ్లిన‌ రాజుగా న‌టించారు. ఆయ‌న‌కు కొడుకు, కూతురు ఉంటారు. కూతురు కుమార్తె.. అంటే సిజు మీన‌న్ మ‌న‌వ‌రాలు పాత్రలో.. అంటే అమ‌ర‌గిరి యువ‌రాణిగా మేఘా ఆకాష్ న‌టించింది. త‌ను సైక్రియాటిస్ట్ చ‌దువుకుంటున్న డాక్టర్ పాత్రలో క‌నిపిస్తుంది.

అమ‌ర‌గిరి ప్రాంతంలోని ఏ ర‌హ‌స్యాన్ని మీరు చూపించ‌బోతున్నారు?
1940ల్లో అమ‌ర‌గిరి ప్రాంతంలో ఓ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంది. 1970లో అది మ‌ళ్లీ పున‌రావృత్తమ‌య్యేలా ఉంటుంది. అలా జ‌ర‌గ‌టాన్ని అక్కడి ప్రజ‌లు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు స‌మ‌స్యా? అని హీరో అక్కడ‌కు వ‌చ్చి స‌మ‌స్యను ప‌రిష్కరించే ప్రయ‌త్నం చేస్తాడు. అదేంటనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.

విక‌ట‌క‌వి సీజ‌న్‌ 2 ఉంటుందా?
ఉంటుందండి.. రైట‌ర్ తేజ ఇప్పటికే దాని మీద వ‌ర్క్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఇంకా పెద్ద స్కేల్‌లో విక‌ట‌క‌వి 2 ఉండ‌బోతుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి?
ఓ న్యూ ఏజ్ ఐడియాతో సైఫై హార‌ర్ క‌థ‌ను తయారు చేసే ప‌నిలో ఉన్నాను. ఓ యాక్షన్ థ్రిల్లర్ ఫాంట‌సీ మీద వ‌ర్క్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు