సమీక్ష : వీర ధీర శూర – స్లో గా సాగే యాక్షన్ డ్రామా

Veera Dheera Sooran Part 2 Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : చియాన్ విక్రమ్, ఎస్.జె.సూర్య, దుషారా విజయన్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు
దర్శకుడు :ఎస్.యు.అరుణ్ కుమార్
నిర్మాత: రియా శిభు
సంగీతం :జి.వి.ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ :థేనీ ఈశ్వర్
ఎడిటర్ : ప్రసన్న జి.కె
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

చియాన్ విక్రమ్, దుషారా విజయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఓ కిరాణా కొట్టు నడుపుకునే కాళి(చియాన్ విక్రమ్) తన భార్య వాణి(దుషారా విజయన్)తో సాఫీగా జీవితం సాగిస్తుంటాడు. అయితే, అతను గతంలో పనిచేసిన పెద్దాయన అలియాస్ రవి(పృథ్వీ రాజ్) ఓ రోజు తన కొడుకు కణ్ణా(సూరజ్ వెంజరమూడు)ని ఎస్పీ అరుణగిరి(ఎస్.జె.సూర్య) నుంచి కాపాడాలంటూ ప్రాధేయపడుతాడు. అసలు వీరితో కాళి ఎలాంటి గతాన్ని పంచుకున్నాడు..? ఐపిఎస్ అయిన ఎస్.జె.సూర్య పెద్దాయన కొడుకును ఎందుకు చంపాలని అనుకుంటాడు..? పెద్దాయన కోరికను కాళి తీరుస్తాడా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాల్లో కథలో చిన్న పాయింట్ ఉంటే సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చవచ్చు. ఈ సినిమాలోనూ అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది. కానీ, ఆ పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఇక ఈ సినిమాలో కాళి పాత్రలో విక్రమ్ తన నుంచి మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అటు ఎస్.జె.సూర్య పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు.

కథను ఎంగేజింగ్‌గా తీసుకెళ్లాలని దర్శకుడు పడిన తాపత్రయం మనకు సినిమా ప్రారంభంలోనే కనిపిస్తుంది. కథలోకి తీసుకెళ్లేందుకు అతడు ఎంచుకున్న విధానం కొంతమేర ఆకట్టుకుంటుంది. ఇక కథను నెరేట్ చేసిన విధానం కూడా పర్వాలేదనిపిస్తుంది.

యాక్షన్ సీక్వెన్స్‌ల కంపోజిషన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అటు హీరో ఎలివేషన్స్ కూడా కొంతమేర ఆకట్టుకుంటాయి. సంగీతం పరంగా బీజీఎం వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి యాక్షన్ కథను ఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడిని కట్టిపడేసే కోర్ పాయింట్ బలంగా ఉండాలి. కానీ, ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. ఓ చిన్న పాయింట్‌ను బేస్ చేసుకుని ఇంత కథను నడిపించారా అని అనిపిస్తుంది. ఇక హీరో పాత్రలో పవర్‌ఫుల్ అంశాలు ఉన్నప్పటికీ, అవి ఎంతసేపూ దాచిపెట్టేందుకే ప్రయత్నించారు. హీరో భార్యగా దుషారా పర్ఫార్మెన్స్ కొంతమేర నచ్చకపోవచ్చు.

ఇక కథలో ఇంటెన్స్ యాక్షన్‌కు స్కోప్ ఉన్నా కూడా రొటీన్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్రెజెంట్ చేసిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్. స్లో పేస్‌తో ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ ఎంగేజింగ్ అనిపిస్తున్న వేళ వచ్చే ఓ సీక్వెన్స్ ఈ సినిమాను ట్రాక్ తప్పేలా చేసింది.

అటు ఎస్.జె.సూర్య పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రను వేరొక సీనియర్ విలన్ చేసుంటే ఆ పాత్రకు మరింత స్కోప్ దక్కేది. మిగతా నటీనటులు కూడా పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ ఎంచుకున్న కథ రొటీన్ అయినప్పటికీ, దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేసి ఉంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే, కథలోని ఇంటెన్స్ పాయింట్స్‌పై ఆయన దృష్టి పెట్టాల్సింది. ఇక సంగీతం పరంగా పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, బీజీఎం వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే, ఎడిటింగ్ వర్క్ మాత్రం చాలా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘వీర ధీర శూర’ చిత్రం నిరాశపరిచే యాక్షన్ డ్రామాగా నిలిచిందని చెప్పాలి. కథలో దమ్మున్నా దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ఫెయిల్ అయ్యింది. నటీనటుల పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. స్క్రీన్ ప్లే, స్లో పేస్ కారణంగా ఈ సినిమా ట్రాక్ తప్పింది. యాక్షన్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version