విడుదల తేదీ : మార్చి 15, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాయ్ లక్ష్మీ , నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్, మధునందన్, ప్రవీణ్ మరియు పంకజ్ తదితరులు.
దర్శకత్వం : కిషోర్ కుమార్
నిర్మాత : ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి.
సంగీతం : హరి గౌర
స్క్రీన్ ప్లే : కిషోర్ కుమార్
ఎడిటర్ : యస్ అర్ శేఖర్
నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్, మధునందన్, ప్రవీణ్ మరియు పంకజ్ కీలక పాత్రలలో నటించారు.కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
పండు (మధు) మరియు చంటి (ప్రవీణ్) ఊరులోనే పక్కా పోరంబోకులు. నీచమైన వెధవ పనులన్నీ చేస్తూ.. ఊర్లో వాళ్ళను టార్చర్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ ఊరిలోకి స్కూల్ టీచర్ గా వెంకటలక్ష్మి (రాయ్ లక్ష్మీ) వస్తోంది. దాంతో చంటి, పండు ఇద్దరూ వెంకటలక్ష్మి వెంట పడతారు. ఆమె మెప్పు కోసం అన్ని రకాల పనులు చేస్తారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వెంకటలక్ష్మి మనిషి కాదు, దెయ్యం అని వాళ్లకు తెలుస్తోంది. తన కావాల్సిన పని చెయ్యకపోతే ఆ ఇద్దరినీ చంపేస్తానని వెంకటలక్ష్మి వాళ్ళను హింసిస్తూ బెదిరిస్తోంది. దాంతో వాళ్లకి ఇంకో దారి లేక వెంకట లక్ష్మి చెప్పినట్లు చేస్తానంటారు. అసలు వెంకటలక్ష్మి ఏం చెయ్యమంది ? అయిన వెంకటలక్ష్మి ఎవరు ? వాళ్ళ ఇద్దరిని మాత్రమే ఎందుకు పట్టుకుంది ? చివరికి వాళ్లు వెంకటలక్ష్మి చెప్పింది, చేశారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొదట వెంకటలక్ష్మీ అనే ఒక స్కూల్ టీచర్ పాత్రలో కనిపించిన రాయ్ లక్ష్మీ తన గ్లామర్ తో పాటు తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆకట్టుకుంది. పాత్రలోని వెరియేషన్స్ కి తగ్గట్లు ఆమె, తన బాడీ లాంగ్వేజ్ ను, తన మాడ్యులేషన్ ను మార్చిన విధానం ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. అలాగే చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే కొన్ని భావోద్వేగాలను చాలా చక్కగా పడించింది.
సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో కనిపించిన పూజిత పొన్నాడాకి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన గ్లామర్ తో మరియు క్లైమాక్స్ లో తన నటనతో సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోంది. ఆలగే సినిమాలో కీలక పాత్రల్లో నటించిన కమెడియన్స్ మధునందన్, ప్రవీణ్ తమ కామెడీ టైమింగ్ తో, తమ కామిక్ హావభావాలతో కొన్ని చోట్ల బాగానే నవ్విస్తారు. ముఖ్యంగా రాయ్ లక్ష్మికి వీళ్ళకు మధ్య వచ్చే కొన్ని హాస్య సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి.
ఇతర కీలక పాత్రల్లో నటించిన నవీన్ నేని, మహాత్, మరియు పంకజ్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. రచయిత కిరణ్ రాసిన స్టోరీ పాయింట్ బాగుంది. అలాగే ఆయన రాసిన కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే సెకెండాఫ్ లో కొత్తగా రివీల్ అయ్యే కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు కిషోర్ కుమార్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. సెకెండ్ హాఫ్ లో ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని, అవి ఆశించిన స్థాయిలో థ్రిల్ చెయ్యవు.
పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు ఇంట్రస్ట్ గా సాగని స్క్రీన్ ప్లే, సినిమా పై ఉన్న ఆసక్తిని నీరుగారిస్తోంది.
ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకుడికి ఆసక్తి రేకెత్తించకుండా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకరచయితలు మాత్రం కథ కథనాలను మాత్రం లాజిక్స్ లేకుండా.. మరీ సినిమాటిక్ గా రాసుకున్నాడు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు హరి గౌర అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. రాయ్ లక్ష్మి మీద వచ్చే పాట ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
యస్ అర్ శేఖర్ ఎడిటింగ్ బాగుంది గాని, అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ న చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.
తీర్పు :
కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా.. సినిమా మాత్రం పూర్తి ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటికీ…. కథ కథనాల్లో ప్లో మిస్ అవ్వడం, పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ వదిలేయడం, అలాగే అనవసరమైన పండని కామెడీ సీన్స్ ను పెట్టడం, సెకెండ్ హాఫ్ లో మొదటి సగభాగం బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోదు. మరి వెంకటలక్ష్మి బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team