గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘YO! 10 ప్రేమకథలు’ మూవీ!

యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో “YO! 10 ప్రేమకథలు” సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. “YO! 10 ప్రేమకథలు” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. ఆయన గతంలో “కల”, “అలా”, “వెల్కమ్”, “స్విమ్మింగ్ ఫూల్” వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా “YO! 10 ప్రేమకథలు” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ.. ‘మనోహర్ చిమ్మని దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి నంది పురస్కారం దక్కింది. దర్శకుడిగా “YO! 10 ప్రేమకథలు” సినిమాతో మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి మంచి పాటలు చేసుకునే వీలు ఉంటుంది. మనోహర్ గారితో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.’ అని అన్నారు.

డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ.. ‘”YO! 10 ప్రేమకథలు” టైటిల్ చాలా బాగుంది. ఈ కథలో పది ప్రేమ కథల్ని చూపించబోతున్నారు దర్శకుడు మనోహర్ చిమ్మని. ఆ ప్రేమ కథలన్నీ జెన్యూన్ గా ఉంటాయని ఆశిస్తున్నా. ఈ సినిమా మనోహర్ గారికి దర్శకుడిగా మరింత మంచి పేరు తీసుకురావాలి. టీమ్ అందరికీ నా విశెస్ అందిస్తున్నా.’ అని అన్నారు.

దర్శకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘మనోహర్ గారు నాకు దర్శకుడిగా కంటే రచయితగా చాలా ఇష్టం. ఆయన రచనా శైలి ఆకట్టుకునేలా ఉంటుంది. “YO! 10 ప్రేమకథలు” సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

చిత్ర దర్శకులు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ.. ‘యో… అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. సుమారు 2 గంటల నిడివి ఉండే ఈ సినిమాలో 10 జంటలుంటాయి. 10 ప్రేమకథలుంటాయి. ఒక్కో ప్రేమకథ ఒక్కో జానర్లో ఉంటుంది. అయితే ఈ ప్రేమకథలన్నింటికీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఆ లక్ష్యమే ఈ సినిమాను యువతరం ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది, యూత్‌ఫుల్‌గా ఆలోచించే అన్ని వయస్సులవారికీ కనెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ నవంబర్ చివరివారం నుంచి ప్రారంభిస్తున్నాము. వైజాగ్, గోవా, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన ఇండోర్ అండ్ అవుట్‌డోర్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యబోతున్నాం. ఈ సినిమాలోని చాలా అంశాల్లో AIని ఉపయోగిస్తున్నాం.’ అని అన్నారు.

Exit mobile version