విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : విక్రమ్, సమంత
దర్శకత్వం : విజయ్ మిల్టన్
నిర్మాత : ఏఆర్ మురుగదాస్
సంగీతం : డి. ఇమాన్
సినిమాటోగ్రఫర్ : కె.ఎమ్ భాస్కరన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
ఈ వారం డబ్బింగ్ చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాయి. విక్రమ్, సమంత నటించిన 10 ఎంద్రాతుకుల్లా తెలుగులో 10 గా డబ్ అయి నేడు విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
విక్రమ్ పేరు గాంచిన కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. కొన్ని పార్సిల్స్ ని అతడు విలన్ లకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు ఊహించిన ఘటన జరుగుతుంది. ఓ పార్సిల్ ని డెలివర్ చేయడానికి విక్రమ్ బయలుదేరుతాడు. సంగం దూరం ప్రయాణించాక తాను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాననే విషయం విక్రమ్ కు అర్థం అవుతుంది. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు? విక్రమ్ ఆమెని ఎలా కాపాడాడు ? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రానికి ఉన్న అతికొద్ది ప్లస్ పాయింట్స్ లో సమంత పాత్ర ఒకటి. సమంత పాత్ర వలన అయినా సినిమా అలా అలా నడుస్తుంది. సమంత తన మార్క్ క్యూట్ లుక్స్, పెర్ఫామెన్స్ తో మెప్పించింది. చిత్రాల్లో ఉన్న లాజిక్ లేని సన్నివేశాలతో పోలిస్తే సమంత పాత్ర పరవాలేదని చెప్పొచ్చు.
కొన్ని కార్ ఛేజింగ్ సన్నివేశాలను బాగా డిజైన్ చేశారు. విజువల్ పరంగా ఆ సీన్లు ఆకట్టుకుంటాయి. విక్రమ్ లాంటి నటుడికి ఈ చిత్రంలోని పాత్ర చాలా సులువనే చెప్పాలి. విక్రమ్ పాత్రలోని కొన్ని సన్నివేశాలు అక్కడక్కడా మెప్పిస్తాయి. ఇక అభిమన్యు సింగ్ పాత్ర పరవాలేదనిపించే విధంగా ఉంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా చూశాక విక్రమ్ లాంటి నటుడు ఈ చిత్రానికి ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం కలుగుతుంది. విక్రమ్ లాంటి అద్భుత నటుడికి ఈ చిత్రంలో చేయాల్సింది ఏమి లేదు. విక్రమ్ పాత్రలో గొప్పగా ఫీలయ్యే సన్నివేశాలు లేవు.
ఈ చిత్రం మొత్తం కారు జర్నీ, హీరో హీరోయిన్లు ఎదుర్కొన సమస్యలపైనే ఉంటుంది. కనీసం ఒక్క సన్నివేశం కూడా బలమైన ప్రభావం చూపలేక పోయింది. విలన్ గ్యాంగ్, వారు చేసే క్రైంకు సంబందించిన సన్నివేశాలు మొత్తం సిల్లీగా అనిపిస్తాయి.
విక్రమ్, సమంత మధ్య ఎటువంటి కెమిస్ట్రీ కనిపించదు. నటించడానికి ఏమి లేకపోయినా వీరి పాత్రల్లో అత్యుత్సాహం కనిపిస్తుంది. దర్శకుడు అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీనికి తోడు మధ్యలో వచ్చే పాటలు చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతిక విభాగం :
చిత్రానికి కెమెరా మెన్ భాస్కరన్ పనితనం ఎలాంటి బూస్ట్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం బాగోలేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. ఎడిటింగ్ కూడా నాసిరకంగా ఉంది. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. ఇక దర్శకత్వం విషయానికి వస్తే..విజయ్ మిల్టన్ లాంటి ప్రతిభగల దర్శకుడు ఇలాంటి చిత్రం తీసాడని ఆశ్చర్యపోక మానరు. కథలోగాని, కథనంలో కానీ ఏమాత్రం పస లేదు. థియేటర్ లో ఉందామా వెళ్లిపోదామా అనే ఆలోచన ఆడియన్స్ లో కలుగుతుంది.
తీర్పు :
10 ఎంద్రాతుకుల్లా తమిళ చిత్రం విక్రమ్ కెరీర్లోని బిగ్గెస్ట్ ప్లాపుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అదే పరిస్థితి. సరైన కథ లేకపోవడం, దారుణంగా అనిపించే స్క్రీన్ ప్లే వీటన్నింటికి తోడు సాగదీసిన సన్నివేశాలతో చిత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని కారు ఛేజింగ్ సన్నివేశాలు మినహా ఈ చిత్రాన్ని భరించడం కష్టమే. టీవీల్లో వచ్చినా దూరంగా ఉండడం మంచింది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team