విడుదల తేదీ : జనవరి 26, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు: హన్సిక మోత్వానీ
దర్శకుడు : రాజు దుస్సా
నిర్మాత: బొమ్మక్ శివ
సంగీత దర్శకుడు: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిపాడు
ఎడిటింగ్: శ్యామ్ వడవలి
సంబంధిత లింక్స్: ట్రైలర్
యువ కథానాయిక హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ థ్రిల్లింగ్ మూవీ 105 మినిట్స్ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది. రాజు దుస్సా తెరకెక్కించిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
ఒక వర్షం కురిసిన రాత్రి తన షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తుంది జాను. అయితే ఆ రాత్రి ఇంట్లో కొన్ని ఊహించని వింత సంఘటనలను ఆమె ఎదుర్కొంటుంది. మరి ఆమె ఇంట్లో చెడు ఉనికి ఏదైనా ఉందా, ఆమె భయానికి కారణం ఎవరు లేదా ఏమిటి, చివరికి ఏమయింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా
ప్లస్ పాయింట్స్ :
ప్రారంభం నాటి నుండి కేవలం ఒకే ఒక్క పాత్రతో ఒకింత పర్వాలేదనిపించే విధంగా మూవీ సాగుతుంది. ఇక తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించి అందరినీ ఆకట్టుకున్నారు నటి హన్సిక. విజువల్స్ మెప్పించాయి.
మైనస్ పాయింట్స్ :
కేవలం ఒకే ఒక పాత్ర తీసుకుని సినిమాని నడపాలి అనే దర్శకుడి ఆలోచన బాగున్నప్పటికీ, కథనం కూడా ఆసక్తికరంగా రాసుకుంటేనే అది ఆడియన్స్ ని అలరిస్తుంది అనే అంశం గుర్తుంచుకోవాలి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఆయన ఈ మూవీని ముందుకు నడిపిన విధానం ఆకట్టుకోదు. స్టోరీ లైన్ ప్రక్కనపెడితే నెరేషన్ అర్ధం చేసుకోవడానికి మనకి సమయం పడుతుంది. ఇదే ఈ సినిమాకి మైనస్. కొన్ని నిమిషాల తర్వాత, ఈ సంఘటనల వెనుక గల కారణాలను తదుపరి గంటలో వెల్లడయ్యే అవకాశం ఉందని ఆడియన్స్ భావించవచ్చు. అయితే, ఈ నిరీక్షణ చివరి వరకు పొడిగించబడి ప్రేక్షకుల సహనానికి ఒకింత పరీక్ష పెడుతూ సినిమా యొక్క అంతర్లీన సందేశం వైపు సాగుతుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి, సస్పెన్స్ కలిగించే సీన్స్ లో హన్సిక రియాక్షన్, టెన్షన్ మనల్ని ఆకట్టుకున్నప్పటికీ వాటిని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు తడబడ్డాడు. నిజానికి ఇటువంటి సిరీస్ లో సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఆడియన్స్ లో మూవీ పై మరింత ఇంట్రెస్ట్ పెంచాలి, అయితే అందుకు భిన్నంగా ఇందులో అవి ఇరిటేషన్ తెప్పిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించిన దర్శకుడు రాజు దుస్సా చాలావరకు విఫలం అయ్యారు అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కథని మరింత ఆసక్తికరంగా ముందుకు నడిపే అవకాశం ఉన్నా, ఏమాత్రం దానిని అందుకోలేక ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. కథలో మరింత డెప్త్ ఉంటె బాగుండేది. గత సినిమాల్లో మాదిరిగా సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ మూవీకి అనుకున్న స్థాయిలో బీజీఎమ్ వర్క్ అందించలేదు. కెమేరామ్యాన్ కిశోర్ బోయిపాడు చిత్రీకరించిన విజువల్స్ బాగున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.
తీర్పు :
మొత్తంగా చెప్పాలి అంటే 105 మినిట్స్ సినిమాలో హన్సిక ఆకట్టుకునే నటన, అలరించే విజువల్స్ తప్ప మరే అంశం ఆకట్టుకోదు. కాగా ఈ వారాంతంలో ఈ హారర్ థ్రిల్లర్ మూవీ బదులు మీరు మరొకటి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
123telugu.com Rating: 1.5/5
Reviewed by 123telugu Team