సమీక్ష : 21st సెంచరీ లవ్ – ఆకట్టుకొని ప్రేమ కథ

21st Century Love review

విడుదల తేదీ : 23 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : గోపినాథ్

నిర్మాత : పి. నరేంద్ర

సంగీతం : కనిష్క

నటీనటులు : గోపినాథ్, విష్ణు ప్రియ


ఈ రోజుల్లో యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునే ప్రేమ అనే రెగ్యులర్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని నటుడు ‘గోపినాథ్’ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమే ఈ ’21st సెంచరీ లవ్’. గోపినాథ్ సరసన విష్ణు ప్రియ హీరోయిన్ గా నటించగా బీ.ఆర్.ఎస్.ఐ పతాకంపై పి. నరేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ప్రేమలో ఉన్న యూత్ కి ఓ సందేశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మన ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

చేసే ప్రతి పనీ తండ్రితో చెప్పి సలహా తీసుకుని చేసే కుర్రాడు బాలు (గోపినాథ్) ఇంటర్మీడియట్ లో ప్రియ (విష్ణు ప్రియ)అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ విషయాన్ని కూడా తండ్రితో చెప్పగా వాళ్ళ నాన్న నీది ప్రేమో, ఆకర్షణో, స్నేహమో తెలుసుకో అని చెప్పగా బాలు కూడా తన తండ్రి చెప్పింది కరెక్ట్ అని భావించి తనది టీనేజ్ లో కలిగే ఆకర్షణో, నిజమైన ప్రేమో లేకపోతే కేవలం స్నేహమో తెలుసుకోవడానికి తన ఓ థియరీ ఫాలో అవుతాడు. ఆ థియరీ ఏమిటి ? దాని వల్ల బాలు, ప్రియలు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు ? చివరికి వాళ్ళు ప్రేమకు సరైన అర్థం తెలుసుకున్నారా ? లేదా ? అనేదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ప్రేమ కథతో ప్రేమికులకు సందేశం అందించాలన్న దర్శకుడు గోపినాథ్ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఓ టీనేజ్ ప్రేమ జంట ద్వారా ఈనాటి యూత్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచించాలి, అసలైన ప్రేమను గుర్తించడం ఎలా అనే కొత్త విషయాల్ని దర్శకుఢు చెప్పాలనుకోవడం బాగుంది. హీరోయిన్ పాత్రలో విష్ణు ప్రియ నటన బాగానే ఉంది.

అలాగే సినిమా రెండవ భాగంలో జబర్దస్త్ కమెడియన్ వేణు, థర్టీ ఇయర్స్ పృధ్వి ల కామెడీ అక్కడక్కడా పండింది. ప్రేమకు అర్థం తెలుసుకొనే ప్రయత్నంలో ప్రేమ జంట పడే కొన్ని రకాల ఇబ్బందుల్ని దర్శకుడు బాగానే చూపించాడు. చివరగా సినిమా రన్ టైమ్ కూడా 119 నిముషాలు కావడం కూడా చెప్పుకోదగ్గ ప్లస్ పాయింటే.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రేమ కథ ద్వారా సందేశం ఇవ్వాలన్న దర్శకుడి ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాని కోసం రాసుకున్న కథ చాలా అంటే చాలా సాదాసీదాగా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ ప్రేమ కథల్ని హ్యాడిల్ చేసేటప్పుడు ఏమాత్రం పోరపాటు జరిగినా ప్రయత్నం మొత్తం వృధా అవుతుంది. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. సినిమా మొత్తం మీద ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టే బలం ఏ దశలోనూ కనిపించలేదు. హీరోయిన్, కమెడియన్లు వేణు, థర్టీ ఇయర్స్ పృధ్వి లు మినహా మిగతా నటీనటులందరి నటనలో ఖచ్చితత్వం లోపించింది.

అలాగే కథనంలో ప్రేమకు అర్థం తెలుసుకునే ప్రయత్నంలో హీరో హీరోయిన్ల ప్రేమ జంట ఎక్కడా కూడా పెద్దగా భావోద్వేగాలకి లోనవకపోవడం, భాధపడకపోవడం చూస్తే నిరుత్సాహం కలుగుతుంది. సినిమా మొదటి భాగంలో గాని, రెండవ భాగంలో గాని దర్శకుడు ఎక్కడా ఆకట్టుకునే కథనం నడపలేదు. పైగా ప్రేమ కథకు ముఖ్యమైన హీరోహీరోయిన్ల మధ్య ఉండాల్సిన కెమిస్ట్రీ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. అసలే బోరింగ్ కథనం నడుస్తుంటే మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు పుట్టిస్తాయి. కొన్ని చోట్ల స్టూడెంట్స్, లవర్స్ చేసే కామెడీ విసుగు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకుడు, హీరో పాత్ర పోషించిన గోపినాథ్ మెసేజ్ ఓరియంటెడ్ లవ్ ఎంటర్టైనర్ పేరుతో రాసుకున్న కథనం చాలా వీక్ గా ఉంది. ప్రేమ కథకు కావాలసిన బలమైన మాటలు ఎక్కడా లేవు. ఇది రచయితగా దర్శకుడి ఫెయిల్యూర్. ఇక సంగీతం విషయానికొస్తే కనిష్క అందించిన సంగీతం ఎక్కడా మెప్పించదు. నాగబాబు ఎడిటింగ్ లో పర్ఫెక్షన్ లేదు. జి. ఎల్. బాబు ఛాయా గ్రహణం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాత పి. నరేంద్ర నిర్మాణ విలువలు పరవాలేదనిపించాయి.

తీర్పు :

ఓ ప్రేమ కథతో సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో తపన, నటీనటుల్లో పూర్తి స్థాయి నటనా పరిణితి, కథనంలో కదిలించే భావోద్వేగపూరిత సన్నివేశాలు తప్పకుండా ఉండాలి. అవే సినిమా చూసే ప్రేక్షకుడ్ని ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. ప్రేక్షకుడు కూడా సందేశాత్మక ప్రేమ కథ అంటే వాటినే ఆశించి సినిమాకి వస్తాడు. కానీ ఈ సినిమాలో అవేమీ లేవు. సింపుల్ గా ప్రేమంటే ఇది అని కేవలం కొన్ని మాటల్లోనే దర్శకుడు అరకొరగా తేల్చేశాడు. కాబట్టి ప్రేమ కథల నుండి ఆశించే బలమైన అనుభూతిని ఆశించి ఈ సినిమాకి వెళితే తీవ్రాతితీవ్రమైన నిరాశ ఎదురవుతుంది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version