సమీక్ష : 3 మంకీస్ – ఆకట్టుకోని కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్

సమీక్ష : 3 మంకీస్ – ఆకట్టుకోని కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్

Published on Feb 8, 2020 3:03 AM IST
3monkeys review

విడుదల తేదీ : ఫిబ్రవరి 07, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కారుణ్య చౌదరి

దర్శకత్వం : అనిల్ కుమార్ జి

నిర్మాత‌లు : నగేష్ జి

సంగీతం :  అనిల్ కుమార్ జి

సినిమాటోగ్రఫర్ : సన్నీ దోమల

ఎడిటర్ : ఉదయ్ కుమార్

ఏళ్ల తరబడి బుల్లి తెరపై జబర్ధస్త్ ద్వారా నవ్విస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 3 మంకీస్. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథ:

ఆనంద్ (రామ్ ప్రసాద్) సంతోష్ (సుడిగాలి)ఫణి (గెటప్ శీను)ముగ్గురు మంచి మిత్రులు. హ్యాపీ బ్యాచ్లర్ లైఫ్ అనుభవిస్తున్న వారి జీవితం ఓ సంఘటన కారణంగా సమస్యలలోకి నెట్టివేయబడతారు. అనుకోకుండా వారు ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటారు. దాని కారణంగా వారి జీవితంలో ఎదురైన ఘటనలు ఏమిటీ? ఆ సమస్య నుండి వారు ఎలా బయటపడ్డారు అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

బుల్లి తెరపై పటా పట్ పంచులతో అదరగొట్టే సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను త్రయం వెండి తెరపై కూడా కామెడీ పంచులతో అలరించారు. మొదటి సగంలో అక్కడక్కడా వారి పంచులు బాగా నవ్విస్తాయి. ఇక జబర్ధస్త్ లో వీరి కామెడీని ఎంజాయ్ చేసిన వారికి తెరపై ముగ్గురిని కలిసి చూడటం కొత్త అనుభూతిని ఇస్తుంది. కామెడీ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలలో వీరి ముగ్గురి నటన ఆకట్టుకుంటుంది. కథలో వీరి పాత్రలకు మినహా ఎవరికీ స్కోప్ లేని క్రమంలో ముగ్గురు అన్నీ తానై ముందుకు నడిపారు.

సెకండ్ హాఫ్ లో వీరు సమస్యలు చిక్కుకొనే సంధర్భంలో వచ్చే ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ బాగుంది, అలాగే ఆ పాటలోని లిరిక్స్ సైతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగా కుదిరాయి. పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, మరియు అనుకోని చిన్న మలుపు ఆకట్టుకుంటింది.

బాడ్ పోలీస్ అధికారి శత్రు పాత్ర చేసిన నటుడు, పాత్రకు తగ్గట్టుగా మంచి ఆహార్యం, మేనరిజంతో బాగా నటించారు. ఇక వేశ్య పాత్ర చేసిన కారుణ్య చౌదరి, చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటించిన నటులు పాత్ర పరిధిలో నటించి మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ మూవీ ప్రధాన బలహీనత కథా, కథనాలు. దర్శకుడు ఎంచుకున్న కథ రొటీన్ గా ఉంది. ఇక ఎటువంటి మలుపులు లేని కథనం వలన వచ్చే జరగబోయే కథను ప్రేక్షకుడి ఊహకు అందేవిగా ఉన్నాయి. మొదటి సగం కామెడీతో నడిపించి సెకండ్ హాఫ్ నుండి ఎమోషల్ కంటెంట్ తో ఆకట్టుకోవాలనుకున్న దర్శకుడి ప్రయత్నం సఫలం కాలేదు.

జబర్ధస్త్ ఫేమ్ తో మంచి కామెడీ పంచులకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిన ఈ ముగ్గురి నుండి ఆశించిన కామెడీ మూవీలో కనిపించకపోవడం మరో మైనస్. అక్కడక్కడా పేలే పంచ్ లు తప్ప పూర్తి స్థాయిలో కామెడీ పండలేదు. కథ కూడా మిగతా పాత్రలకు ఎటువంటి అవకాశం లేకుండా వారిపైనే సాగుతుంది. పట్టులేని కథలో పదే పదే ఈ ముగ్గురి పాత్రలు మరియు సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి.

ఓ భావోద్వేగమైన ఎమోషనల్ చైల్డ్ హుడ్ సన్నివేశంతో సినిమా ప్రారంభించడంతో మూవీపై ప్రేక్షకుడికి కలిగే అభిప్రాయానికి భిన్నంగా ఇది నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, మరియు చిత్రాన్ని ఇచ్చిన ముగింపు ఏమాత్రం ఆకట్టుకోవు.

 

సాంకేతిక విభాగం:

దర్శకుడు అనిల్ కుమార్ జి ఎంచుకున్న కథలో ఎటువంటి కొత్తదనం లేదు. కథనం కూడా ఏమాత్రం ఆసక్తి లేకుండా ఊహకు అందేలా సాగుతుంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ల మీద వచ్చే అనేక సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తాయి. కామెడీ కోసం సెక్సాలజిస్ట్ గా షకలక శంకర్ ని పరిచయం చేసి, సుధీర్ కి మానసిక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికే తీసుకెళ్లడంలో లాజిక్ మిస్ అయ్యింది. ఇలాంటి లాజిక్ లేని సీన్స్ ఆయన చాల రాసుకున్నారు.

నిర్మాణ విలువలు పర్వాలేదు. బీజీఎమ్ ఒకింత ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ మాత్రం ఘోరమ్ అని చెప్పాలి. ఈ చిత్రంలో కథకు సంబంధం లేని అనేక సన్నివేశాలు నిడివి పెంచి విసిగిస్తాయి. శ్రీ చరణ్ లిరిక్స్ బాగున్నాయి.
 

తీర్పు:

కొత్తదనం లేని కథ పట్టులేని కథనంతో సాగిన 3 మంకీస్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం హాస్యం అక్కడక్కడా పేలినా , ఎమోషన్స్ పరంగా విఫలం చెందింది. పూర్తి స్థాయి కామెడీ ఆశించిన వెళ్లిన ప్రేక్షకులకు 3 మంకీస్ లో అనుకున్నంత కామెడీ దొరకదు. ఐతే సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ నటన మరియు అక్కడక్కడా పేలే కామెడీ పంచ్ లు ఆకట్టుకుంటాయి. ఈ ముగ్గురు మిత్రులు చేసే కామెడీ, సరదా సన్నివేశాలు కొంచెం ఉపశమనం కలిగిస్తాయి. జబర్థస్త్ ప్రేక్షకులు ఈ మూవీలోని సుడిగాలి సుధీర్ టీమ్ ని ఒకింత ఇష్టపడే అవకాశం కలదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు