సమీక్ష : 90 ఎంఎల్‌ – కామెడీ క్లిక్ అయినా ఎమోషన్స్ పేలలేదు

సమీక్ష : 90 ఎంఎల్‌ – కామెడీ క్లిక్ అయినా ఎమోషన్స్ పేలలేదు

Published on Dec 6, 2019 11:40 PM IST
 90 ML review

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు :  కార్తికేయ, నేహా సోలంకి, రోల్ రైడ, రావు రమేష్, ప్రగతి, సత్య ప్రకాష్, అజయ్, రవికిషన్ తదితరులు.

దర్శకత్వం : యెర్ర శేఖర్ రెడ్డి

నిర్మాత‌లు : అశోక్ రెడ్డి గుమ్మకొండ

సంగీతం :  అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫర్ : జె. యువరాజ్

ఎడిటర్:  ఎస్ ఆర్ శేఖర్

యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది విడుదల చేసిన మూడవ చిత్రం 90ఎంఎల్. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి ఓ వైవిధ్యమన పాయింట్ ఆధారంగా యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. కార్తికేయ కు ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగున్నాయి. మరి ఆ అంచనాలను 90ఎంఎల్ ఎంతవరకు చేరుకుందో సమీక్షలో చూద్దాం..

కథ:

కార్తికేయ (దేవదాస్) కు పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధి ఉంటుంది. దానికి ఉపశమనంగా దేవదాస్ ప్రతిపూటా ఓ 90ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోతే ప్రాణాలే పోయేంతటి జబ్బు ఉన్న దేవదాస్, అది అంటేనే అసహ్యంగా భావించే కుటుంబానికి చెందిన సువాసన (నేహా సోలంకి) ప్రేమలో పడతాడు. దేవదాస్ కి మందు తాగే అలవాటున్న విషయం తన దగ్గర దాచాడన్న కోపంతో సువాసన దేవదాస్ ని వదిలి వెళ్ళిపోతుంది. మరి మందు తాగితేనే బ్రతక గల దేవదాస్ సువాసన ప్రేమ కోసం మందు వదిలేశాడా? దేవదాస్ లోపాన్ని అర్థం చేసుకొని సుహాసన అతని ప్రేమను అంగీకరించిందా? చివరికి ఈ యువ జంట ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

కార్తికేయ స్క్రీన్ ప్రజెన్స్ చూసిన ఎవరికైనా టాలీవుడ్ కి ఓ మంచి మాస్ హీరో దొరికాడనిపించక మానదు. ఆయన ఎనర్జిటిక్ డాన్స్ లు మరియు ఆరడుగుల సాలిడ్ ఫిజిక్ తో చేసే పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. అతని కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కార్తికేయ స్క్రీన్ పై కనిపించిన ప్రతి సన్నివేశం అతని ఎనర్జీ తో ఆహ్లాదంగా ముందుకు సాగుతుంది.

ఫిజియో థెరఫిస్ట్ గా హీరోయిన్ నేహా సోలంకి క్యూట్ గాఉన్నారు.సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ప్రేమకు కుటుంబానికి మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఆమె ఒదిగిపోయారు.

బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫేమస్ అయిన రోల్ రైడర్ కార్తికేయ స్నేహితుడిగా ఫుల్ టైమ్ రోల్ దక్కించుకున్నాడు. కార్తికేయ పక్కన ఉంటూ ఆయన వేసే కామెడీ సెటైర్స్ అక్కడక్కడా పేలాయి.
ప్రధాన విలన్ గా రవికిషన్ ఈ చిత్రంలో కచ్చితంగా కొత్తగా ట్రై చేశాడు అని చెప్పాలి.మేల్ ఫిమేల్ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో ఆయన చేసే కామెడీ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కార్తికేయ తల్లిదండ్రులుగా చేసిన ప్రగతి, సత్య ప్రకాష్ లు తమ పరిధిలో చక్కని నటన కనబరిచారు. రావు రమేష్ ఎప్పటిలాగే తన మార్కు నటనతో అలరిస్తారు

 

మైనస్ పాయింట్స్:

మందు తాగకుంటే ప్రాణాలు పోయే వ్యాధి వున్న పాత్రను హీరోగా తీసుకొని దానికి ప్రేమతో ముడిపెట్టి కొత్తగా చెప్పాలనుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం అనేది సినిమా ప్రధాన బలహీనత. పాతకాలపు స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో పాట, ఫైట్ మధ్యలో అక్కడక్కడా కామెడీ అన్నట్లుగా సినిమా నడిపించారు.

సన్నివేశాలు ఎటువంటి ఫ్లో లేకుండా వేటికవే వచ్చి వెళ్లిపోతుంటాయి. హీరో చేసే భీకరమైన ఫైట్స్ కి బలమైన కారణం లేకపోవడం వలన కనెక్ట్ కావు.

మొదటి సగంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే క్లైమాక్స్ తేలిపోయాయి. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ మరియు మందు అలవాటు వలన ప్రేమికుల మధ్య ఏర్పడే బ్రేక్ అప్ సన్నివేశాలు ఇంకా కొంచెం బలమైన సన్నివేశాలతో తెరకెక్కించాల్సింది. కామెడీ ట్రాక్స్ కూడా క్లాస్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. సినిమా నిడివి కూడా ఎక్కువైపోయింది.

 

సాంకేతిక విభాగం:

అనూప్ రూబెన్స్ సంగీతం పాటల పరంగా ఆకట్టుకున్నప్పటికీ బీజీఎమ్ విషయంలో విఫలం చెందింది. ప్రతి యాక్షన్ సన్నివేశంలో ఆయన ఒకేరకమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆర్డినరీ సన్నివేశాలు కూడా బలమైన బీజీఎమ్ కారణంగా మనసుని హత్తుకున్న సందర్భాలు అనేకం.

ఎడిటింగ్ పూర్తిగా నిరాశ పరుస్తుంది. ఈ జోనర్ వచ్చే సినిమాలకు తక్కువ నిడివి ఉన్నప్పుడే ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

ఇక దర్శకుడు యెర్ర శేఖర్ రెడ్డి ఓ కొత్త పాయింట్ చుట్టూ ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పాలనే క్రమంలో ఓల్డ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ తీసుకున్నారు.ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా రాసుకున్నప్పటికీ వాటిని తెరపై సరైన క్రమంలో పేర్చిడంలో విఫలం చెందారు. కొత్త దర్శకుడు కావడంతో ఆయన అనుభవ రాహిత్యం తెరపై కనిపిస్తుంది. అసలు కథకు అవసరం లేని విలన్ ట్రాక్స్ రాసుకొని సినిమాను దెబ్బ తీశారు.

 

తీర్పు:

యంగ్ హీరో కార్తికేయ 90ఎం ఎల్ లో ఆడియన్స్ కి సరిపడా కిక్ లేదని చెప్పాలి. నూతన పాయింట్ చుట్టూ ప్రేమ ఘర్షణను ఎమోషనల్ గా చెప్పాలనుకున్నప్పటికి, పాత కాలపు స్క్రీన్ ప్లే,అవసరం లేని విలనిజం సినిమా సోల్ ని దెబ్బ తీశాయి. బలమైన కారణం లేకుండా కార్తికేయ చేసే భీకరమైన పోరాటాలు అంతగా ఆకట్టుకోవు.ఐతే అనూప్ రూబెన్స్ సాంగ్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీ కొంత ఉపశమనం కలిగిస్తుంది.కేవలం కార్తికేయ స్క్రీన్ ప్రెజెన్స్, పోరాటాలు ఇష్టపడే వారికి 90ఎం ఎల్ నచ్చుతుంది.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here English Vesrion

సంబంధిత సమాచారం

తాజా వార్తలు