విడుదల తేదీ : జనవరి 05, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: శివాజీ, మౌళి, వాసుకి ఆనంద్, వసంతిక, రోహన్, స్నేహల్ కామత్ తదితరులు.
దర్శకుడు :ఆదిత్య హాసన్
నిర్మాతలు: నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
సంబంధిత లింక్స్: ట్రైలర్
తాజాగా ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఈటివి విన్ లో ప్రసారమైన 90’s సిరీస్ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, మౌళి, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథ:
ఈ కథ 90 ల కాలంలో వనపర్తి లో జరుగుతుంది. చంద్రశేఖర్ (శివాజీ) ఒక మధ్యతరగతి జీవితం గడిపే టీచరు. అతడి భార్య రాణి (వాసుకి) హోమ్ మేకర్. కాగా వారికి రఘు తేజ (మౌళి), దివ్య (వసంతిక), మరియు ఆదిత్య (రోహన్) ముగ్గురు సంతానం. అయితే తమ మధ్యతరగతి కుటుంబంలో సర్దుకునే పరిస్థితుల పై పిల్లలు ముగ్గురూ కొంత అసంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా చంద్రశేఖర్ తమ పిల్లల యొక్క చదువుల విషయమై ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటాడు. మొత్తంగా వారి మధ్య తరగతి జీవితంలో సాగె యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా 90’s సిరీస్ సాగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
ఈ సిరీస్ అటు యువత తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 90 ల కాలం నాటి జీవితం అప్పటి పరిస్థితులని మనకు ఒకసారి గుర్తుచేస్తాయి. నిజానికి ఈ సిరీస్ లో పెద్ద స్టోరీ లేనప్పటికీ కథనం నడిచే విధానం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ప్రతి సన్నివేశం సినిమాటిక్ గా కాకుండా ఎంతో సహజంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ లో మన చిన్నప్పటి జ్ఞాపకాల్లో ముఖ్యంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారిని డబ్బులు అడగడం, నాన్న ఇంట్లో లేనప్పుడు టివి చూడడం, చిన్న చిన్న వాదనలతో అమ్మతో కలిసి మనకు నచ్చినవి వండించుకు తినడం వంటివి ప్రతి ఒక్కరినీ తాకుతాయి. ఆ విషయమై దర్శకుడు కథనాన్ని అందరినీ అలరించేలా రాసుకున్నారు. దానికి మెచ్చుకోవాలి. ఓవైపు ఫన్ తో పాటు మరోవైపు ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక సిరీస్ లో తాను ఇంటిని ఏ విధంగా నెట్టుకుని వస్తుందో భర్త శివాజీకి భార్య వాసుకి వివరించే సన్నివేశం మధ్యతరగతి వారి జీవితాలని ప్రతిబింబిస్తుంది. ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ అద్భుత పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని ఎంతో అలరిస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి భార్య భర్తలుగా శివాజీ, వాసుకి ఇద్దరూ కూడా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలానే కీలక పాత్రలు చేసిన మౌళి, వసంతిక, రోహన్ ముగ్గురూ కూడా ఎంతో బాగా యాక్ట్ చేసారు. అలానే స్నేహాల్ కామత్ పాత్ర కూడా అలరిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
అయితే ఈ సిరీస్ లోని మూడవ ఎపిసోడ్ లో ప్రైవేట్ స్కూల్స్ లో విద్యా విధానం పై నటుడు శివాజీ చెప్పే సన్నివేశాలు మరింత బెటర్ గా రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ స్లో గా అనిపించడంతో పాటు రిపీట్ అయినట్లు గా అనిపిస్తాయి. ఇక ఈ సిరీస్ లో పెద్దగా కథ అంటూ లేకపోవడంతో చాలావరకు ఊహాజనితంగా ఉంటుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ విభాగం వారు కట్ చేసుంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
అజీమ్ మొహమ్మద్ ఫోటోగ్రఫి తో పాటు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సిరీస్ మొత్తం ఎంతో బాగున్నాయి. ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విభాగం వారి పని తీరు కూడా బాగుంది, అయితే వారు ఇంకా బాగా వర్క్ చేసి ఉంటె బాగుండేది. ఇటువంటి అహ్లాదకరమైన ఫామిలీ సిరీస్ తో ఆడియన్స్ ముందుకి వచ్చి మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ సిరీస్ టైటిల్ మాదిరిగా 90’s కాలం నాటి పిల్లలు వారి తల్లితండ్రులకు ఒక మంచి మెమరీగా చెప్పుకోవచ్చు. మంచి ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొద్దిగా స్లో అనిపించినా ఓవరాల్ గా బాగుంటుంది.
తీర్పు :
మొత్తంగా ఈ 90’s సిరీస్ గురించి చెప్పాలి అంటే దర్శకుడు ఆదిత్య హాసన్ అందరికీ కనెక్ట్ అయ్యే చక్కని కథాంశాన్ని అంశాన్ని తీసుకుని దానిని తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఇది 90’s కాలం నాటి మధ్య తరగతి వారి చక్కాయి బయోపిక్ గా చెప్పుకోవాలి. శివాజీ, వాసుకి, వసంతిక, మౌళి, రోహన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి సిరీస్ లో అలరించారు. అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ మొత్తంగా అయితే చక్కగా మన ఫ్యామీలీస్ తో కలిసి ఈ వారం ఈ సిరీస్ చూసేయొచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team